ఏపీలో భారీగా పెరిగిన ఉద్యోగ వేతనాల మొత్తం

జీతాల వ్యయం ఏపీలో అధికంగా ఉందని కాగ్‌ హెచ్చరించింది. మరోవైపు 12వ పీఆర్సీకి సమయం ఆసన్నమైంది. త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో 12వ పీఆర్సీపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Advertisement
Update:2023-06-07 08:26 IST

ఏపీలో ఉద్యోగుల జీతాల వ్యయం భారీగా పెరిగినట్టు కాగ్ వెల్లడించింది. ఏడాదిలోనే దాదాపు 8వేల కోట్ల రూపాయల భారం పెరిగింది. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే ఉద్యోగులు, పెన్ష‌న్‌దారులకు ఆదాయంలో అధికంగా ఖర్చు చేస్తున్నట్టు తేల్చింది. 2021-22తో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల మొత్తం 2022-23 నాటికి రూ. 8,068 కోట్లు పెరిగింది. ప్రభుత్వోద్యోగుల పెన్ష‌న్ల వ్యయం 2021-22తో పోలిస్తే గతేడాదికి రూ.2,257 కోట్లు అధికంగా ఉంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం 2021-22లో మొత్తం రూ.40,895 కోట్లు వెచ్చించారు. అదే 2022-23లో రూ. 48,964 కోట్లు అయింది.

పింఛ‌న్‌దారులకు 2022-23లో రూ. 22,583 కోట్లు వ్యయం అయింది. ఏపీలో జీతాల భారం మధ్యప్రదేశ్‌, తెలంగాణ, బెంగాల్‌, బీహార్, కర్నాటక, గుజరాత్‌ కంటే అధికంగానే ఉంది. మధ్యప్రదేశ్‌ ఉద్యోగుల జీతాల వ్యయం రూ. 45,771 కోట్లుగా ఉంది. తెలంగాణలో రూ. 35,266 కోట్లు, బెంగాల్‌లో రూ. 26,049 కోట్లు, బీహార్‌లో రూ. 26,231 కోట్లు, కర్నాటకలో రూ. 17,815 కోట్లు, గుజరాత్‌లో రూ. 14,062 కోట్లను ఉద్యోగుల జీతాల కోసం ఖర్చు చేస్తున్నారు.

జీతాల వ్యయం ఏపీలో అధికంగా ఉందని కాగ్‌ హెచ్చరించింది. మరోవైపు 12వ పీఆర్సీకి సమయం ఆసన్నమైంది. త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో 12వ పీఆర్సీపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. 12 పీఆర్సీ సిఫార్సులు అమలులోకి వస్తే అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులపై వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News