అన్న క్యాంటీన్లకు పసుపు రంగు వేస్తారా..? అంబటి లాజిక్
అన్న క్యాంటీన్లను పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు అంబటి. రెండు, మూడు వందల మందికి అన్నం పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారని చెప్పారు.
ప్రస్తుతం ఏపీలో అన్న క్యాంటీన్లు హాట్ టాపిక్ గా మారాయి. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా 100కు పైగా అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు లాంఛనంగా వీటిని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అన్న క్యాంటీన్లను తమకు అనుకూలంగా భారీగా ప్రచారం చేసుకుంటోంది టీడీపీ. పేదవాడికి 5 రూపాయలకే పట్టెడు అన్నం పెట్టే క్యాంటీన్లు మళ్లీ తిరిగి వచ్చాయని, ఇది టీడీపీ ప్రభుత్వ పాలనలో పేదలకు జరిగిన న్యాయం అని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అయితే వైసీపీ ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ గానే రియాక్ట్ అయింది. అన్న క్యాంటీన్ల పేరుతో కూటమి ప్రభుత్వం మరో మోసానికి తెరతీసిందని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పథకాలను పక్కన పెట్టి అన్న క్యాంటీన్ల పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని విమర్శించారు అంబటి రాంబాబు. అంతాకాదు అన్న క్యాంటీన్లకు పసుపు పచ్చ రంగు ఎందుకు వేశారని లాజిక్ తీశారు. గతంలో సచివాలయాలకు బులుగు రంగు వేస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్న టీడీపీ నేతలు, ఇప్పుడు అన్న క్యాంటీన్లకు పసుపు రంగు ఎలా వేస్తారని నిలదీశారు. అన్న క్యాంటీన్లను తాము వ్యతిరేకించడంలేదని, ఆ పేరుతో ప్రభుత్వం వాటిని పార్టీ ఆఫీస్ ల మాదిరిగా రెడీ చేయడం సరికాదన్నారాయన. సూపర్ సిక్స్ హామీలను సూపర్ చీట్‌గా మార్చేశారని ఎద్దేవా చేశారు అంబటి.
పబ్లిసిటీ స్టంట్..
అన్న క్యాంటీన్లను పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు అంబటి. రెండు, మూడు వందల మందికి అన్నం పెట్డి, విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటారని చెప్పారు. ఊరికి దూరంగా అన్న క్యాంటీన్లను నిర్మించారని, జనసంచారం లేని చోట నిర్మించి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. క్యాంటీన్ల నిర్మాణం పేరుతో ఇప్పటికే రూ.31 కోట్లు దోచేశారన్నారు అంబటి.