మీ తప్పుల్ని మాపై రుద్దుతారా..?

స్పిల్‌వే చానల్‌, అప్రోచ్‌ చానల్‌, నది డైవర్షన్‌ పూర్తి కాకుండా కాపర్‌ డ్యామ్‌ను ప్రారంభించి డయా ఫ్రం వాల్‌ను నిర్మించడం గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు అంబటి.

Advertisement
Update: 2024-06-28 14:35 GMT

పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయడంతోపాటు, తప్పంతా జగన్ దేనని సీఎం చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ నుంచి మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానమిచ్చారు. శ్వేతపత్రంలో ఉన్నవన్నీ అబద్ధాలు, అసత్యాలేనన్నారు అంబటి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు ఉందని అన్నారు.


స్పిల్‌వే చానల్‌, అప్రోచ్‌ చానల్‌, నది డైవర్షన్‌ పూర్తి కాకుండా కాపర్‌ డ్యామ్‌ను ప్రారంభించి డయా ఫ్రం వాల్‌ను నిర్మించడం గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు అంబటి. అసలు కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ ని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. కేవలం నిధులు కొట్టేసేందుకే ఆ ప్రాజెక్ట్ ని చంద్రబాబు తలకెత్తుకున్నారని, ఇప్పుడు తప్పు వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని గతంలో ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఈ సందర్భంగా గుర్తు చేశారు అంబటి. పాత వీడియోలన్నీ చంద్రబాబు స్క్రీన్ పై చూపిస్తున్నారని, గతంలో మంత్రిగా ఉన్న దేవినేని ఉమా, పోలవరం ప్రాజెక్ట్ ని 2018లోగా పూర్తి చేస్తామని చెప్పారని, దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు .

చంద్రబాబు మాటలు చూస్తుంటే వారి హయాంలో పోలవరం పూర్తయ్యేలా లేదని, తిరిగి జగన్ అధికారంలోకి వచ్చాక తామే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. పోలవరం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పేమీ లేదన్నారాయన. కరోనా సమయంలో కూడా పోలవరం పనులు కొనసాగాయని వివరించారు. పోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్థం కాదని, అందుకే బాగా స్టడీ చేసి తాము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. కేవలం జగన్ ని విమర్శించేందుకే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని అన్నారు. నాలుగోసారి సీఎం అయ్యాక చంద్రబాబులో అహం మరింత పెరిగిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి. 

Tags:    
Advertisement

Similar News