చిత్తుపేపర్లు తగలబడితే అది కూడా న్యూసా..?
ధవళేశ్వరం ఆఫీస్ కి కొత్త బీరువాలు వచ్చాయని, వాటిల్లో ఫైళ్లను సర్దేయగా, మిగిలిపోయిన చెత్తను బయట తగలబెట్టారని దాన్ని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు అంబటి రాంబాబు.
చిత్తు పేపర్లు తగలబడితే అది కూడా పెద్ద న్యూస్ గా ఈటీవీ, ఏబీఎన్ ఛానెళ్లలో ప్రచారం జరుగుతోందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆ వార్తలు చూసి తనకు నవ్వొచ్చిందని, అవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ధవళేశ్వరం ఆఫీస్ లో ఫైళ్లు తగలబడ్డాయనే వార్తలు అవాస్తవం అని, పనికిరాని చెత్త పేపర్లను అక్కడ తగలబెట్టారని చెప్పారు. ఆ చెత్త తగలబడితే దాన్ని వైసీపీ మీద నెట్టాలనుకోవడం దారుణం అని అన్నారు అంబటి రాంబాబు.
అసలేం జరిగింది..?
పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలోని ఫైల్స్, పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన ఫైల్స్ దగ్ధమయ్యాయని ఈరోజు టీడీపీ అనుకూల మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఆఫీస్ లోని అధికారులే వాటిని కాల్చేశారని కూడా ఆరోపించారు. భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటకు వస్తాయనే అనుమానంతో వాటిని తగలబెట్టారని అన్నారు. సగం కాలిపోయిన ఫైళ్లను ధవళేశ్వరం పోలీసుల స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారనేది ఆ కథనాల సారాంశం.
అయితే ధవళేశ్వరం ఆఫీస్ కి కొత్త బీరువాలు వచ్చాయని, వాటిల్లో ఫైళ్లను సర్దేయగా, మిగిలిపోయిన చెత్తను బయట తగలబెట్టారని దాన్ని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు అంబటి రాంబాబు. ప్రతి విషయాన్ని వైసీపీకి అంటగడుతూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆ వార్తలు వింటే తనకు నవ్వొచ్చిందని అన్నారు అంబటి.