మీ ముగ్గురూ కలిస్తే 60.. మాకు సింగిల్ గా 40

టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టిందని, పదే పదే వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.

Advertisement
Update:2024-06-27 20:04 IST

40 శాతం ఓటు షేర్ ఉన్న రాజకీయ పార్టీ వైసీపీ అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అవతల మూడు పార్టీలు కలిస్తే వారికి పడిన ఓట్లు 60 శాతం అని, వైసీపీకి సింగిల్ గా 40 ఓట్లు వచ్చాయని వివరించారాయన. ఏపీలో విధ్వంస రాజకీయాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ప్రజావేదిక కూల్చివేశామన్న కక్షతో ఇప్పుడు వైసీపీ ఆఫీస్ ని కూల్చేశారని, మిగతా ఆఫీస్ లకు కూడా నోటీసులిస్తున్నారని ఆరోపించారు. తమ ఆఫీస్ ల నిర్మాణం అక్రమం అయితే, అధికారులు నోటీసులివ్వాలి కానీ, టీడీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి భవనాలు కూలుస్తామని హెచ్చరించడమేంటని ప్రశ్నించారు అంబటి. ఇది అరాచకం, అక్రమం, అధికారం ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరని అన్నారాయన.


పిన్నెల్లిని వేధిస్తారా..?

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంలు పగలగొట్టారనేది కేవలం ఆరోపణ మాత్రమేనని, ఆ వీడియోలను పోలీసులు కానీ, ఎన్నికల కమిషన్ కానీ బయటపెట్టలేదని, లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాతే కేసు పెట్టారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు అంబటి. మాచర్లలో వరుసగా గెలుస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అని, ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు భారీ ప్లాన్ లు వేశారన్నారు అంబటి. కక్షసాధింపు కోసమే పిన్నెల్లిపై కేసులు పెట్టారన్నారాయన. అరెస్ట్ కి సహకరించినా సరే పిన్నెల్లిపై వేధింపులు మానలేదన్నారు. కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారని, ఆయన కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని అన్నారు అంబటి.

టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టిందని, పదే పదే వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడేది లేదన్నారు. ప్రజా బలం తమకు ఉందని, 40శాతం మంది ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. పార్టీ ఆఫీస్ ల కూల్చివేత, కేసులపై తాము న్యాయపోరాటం చేస్తామన్నారు అంబటి. 

Tags:    
Advertisement

Similar News