పవన్ కౌంట్ 373.. వెయ్యిసార్లు జగన్ పేరు జపిస్తే పాపం పోతుంది
రెండు ప్యాకేజీలుగా ఉన్న వరాహం యాత్ర పూర్తి చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి.
పవన్ కల్యాణ్ వారాహి వరుస ఎపిసోడ్ ల లాగే మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కి కౌంటర్లిచ్చేందుకు వరుసగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జగన్ జగన్ అంటూ సీఎం జగన్ పేరుని వెయ్యిసార్లు తలుచుకుంటే పవన్ కల్యాణ్ చేసిన పాపాలు పరిహారం అవుతాయని అన్నారు అంబటి రాంబాబు. ఇప్పటి వరకు పవన్ 373 సార్లు జగన్ పేరు తలచుకున్నారని, మిగతా 627 సార్లు కూడా పూర్తి చేయాలని సలహా ఇచ్చారు.
పవన్ కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని మరోసారి చెప్పిన అంబటి, ఎవరైనా చికిత్స చేసేవారు ఉంటే ముందుకు రావాలన్నారు. ఔత్సాహిక వైద్యులకు పవన్ ఒక కేస్ స్టడీలాగా పనికొస్తారన్నారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్ కు కోపం వచ్చి ఊగిపోయారని.. పవన్ ఏకపత్నీవ్రతుడేనని తాము ఒప్పుకుంటున్నామని సెటైర్లు పేల్చారు. ఏక పత్నీవ్రతుడంటే.. ఏక కాలంలో ఒక పత్నితోనే ఉంటారని.. ఈ సమాధానం బాగుందా అని ప్రశ్నించారు.
లెక్క తేలేదెప్పుడు..
రెండు ప్యాకేజీలుగా ఉన్న వరాహం యాత్ర పూర్తి చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి. గోదావరి జిల్లాల నుంచి పవన్ వెళ్లిపోయారని, మళ్లీ ఆయన తిరిగి రావాలంటే "లెక్క" తేలాలని ఆ "లెక్క" ని నాదెండ్ల మనోహర్ టీడీపీ ఆఫీసుకెళ్లి తేల్చితే అప్పుడు పవన్ వస్తారని చెప్పారు. హిందూమతాన్ని ఉద్ధరించడానికి వచ్చానంటున్న పవన్, అన్ని పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారని, అలాంటి వ్యక్తి ఇక హిందూ మతాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. పవన్ టూర్ అయిపోయింది, ఇక రేపటి నుంచి చంద్రబాబు తిరుగుతారని.. పవన్, చంద్రబాబు, లోకేష్ రిలేటూర్లు చేస్తుంటారని ఎద్దేవా చేశారు.
పోలవరంపై విషం ..
పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ రామోజీరావు బంధువు నుంచి పోయిందని కక్ష కట్టారని, తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. డయాఫ్రంవాల్ నిర్మాణం వరదల వల్ల కొట్టుకుపోలేదని, కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం, కమీషన్ల వలనే కొట్టుకుపోయిందన్నారు. ఆ విషయాలు రామోజీ ఎందుకు రాయటం లేదని నిలదీశారు. చంద్రబాబు చేసిన దుర్మార్గపు పనులు వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని, దాన్ని నిరూపించడానికి తాము సిద్ధమేనని చెప్పారు.