'రెడ్ బుక్'ని కాదు.. 'మేనిఫెస్టో'ని అమలు చేయండి
ఏపీలో 'రెడ్ బుక్' ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఇటీవల కొత్త ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అటు ప్రెస్ మీట్లు, ఇటు ఘాటు ట్వీట్లు.. మీడియా, సోషల్ మీడియాలో కూడా కూటమిని తరుముకుంటున్నారు అంబటి. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో అమలులో ఆలస్యం చేస్తోందని అంటున్న ఆయన.. తాజాగా మరోసారి చురకలంటించేలా ట్వీట్ వేశారు. ప్రస్తుతం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని, అసలు అమలు చేయాల్సింది మేనిఫెస్టో అని ఎద్దేవా చేశారు.
ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన అంబటి, తల్లికి వందనం పేరుతో చంద్రబాబు తల్లికి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా చంద్రబాబు ఇలాగే మోసాలు చేశారని, ఈసారయినా మేనిఫెస్టో అమలు చేస్తారని అనుకుని ప్రజలు మోసపోయారని.. అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా మోసం చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన వాగ్దానాలను సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు అంబటి.
అదే సమయంలో ట్విట్టర్ ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు అంబటి రాంబాబు. ఇంటిలో ప్రతి బిడ్డకు రూ.15వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామంటూ టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడేమో ఒక బిడ్డకేనంటూ మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. మరోవైపు ఏపీలో 'రెడ్ బుక్' ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.