చేరికలతోపాటు వైసీపీకి రాజీనామాలు కూడా..

కొన్నిరోజుల తర్జన భర్జనల అనంతరం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. మళ్లీ చీరాల నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

Advertisement
Update:2024-04-04 18:52 IST

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ప్రతి రోజూ వైసీపీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. పలు నియోజకవర్గాలకు చెందిన ప్రతిపక్ష పార్టీల కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటున్నారు, జగన్ కి జై కొడుతున్నారు. అదే సమయంలో వైసీపీలోని అసంతృప్త బ్యాచ్ కూడా బయటకు వెళ్లిపోతోంది. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఇటీవల వైసీపీకి దూరం కాగా, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా వెళ్లిపోవడం వల్ల వైసీపీకి నష్టం ఉందా, లేక గ్రూపుల సమస్యలు తొలగిపోయి మేలు జరుగుతుందా అనేది వేచి చూడాలి.

కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ టికెట్ ఇవ్వగా చీరాల ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి కృష్ణమోహన్. వైసీపీ ఏర్పడిన తర్వాత ఆయన వెంటనే జగన్ వైపు రాలేదు. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు, టీడీపీ అధికారంలోకి రాగానే అటు వెళ్లిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి టికెట్ సాధించారు. రాష్ట్రంలో పార్టీ గెలిచింది కానీ చీరాలలో ఆయన ఓడిపోయారు. పైగా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీలోకి రావడంతో అక్కడ ఆమంచికి షాక్ తగిలింది. టెంపరరీగా ఆయన్ను పర్చూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ గా పంపించారు సీఎం జగన్. అయితే అక్కడ కూడా ఆయనకు టికెట్ దక్కలేదు. ఇటు చీరాల నుంచి కరణం బలరాం తనయుడు వెంకటేష్ కి వైసీపీ టికెట్ దక్కింది. దీంతో కొన్నిరోజుల తర్జన భర్జనల అనంతరం ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. మళ్లీ చీరాల నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు, రాష్ట్ర కాపు నాడు నాయకుడు ఆమంచి స్వాములు కూడా ఆమధ్య జనసేనలో చేరి బాపట్ల జిల్లానుంచి ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నారు. పొత్తుల్లో టికెట్ దక్కడం అసాధ్యం అని తేలడంతో.. జనసేనకు రాజీనామా చేశారు స్వాములు. ఆమంచి బ్రదర్స్ ఇద్దరికీ ఆయా పార్టీలు హ్యాండివ్వడంతో.. రాజీనామాలు చేసి భవిష్యత్ కార్యాచరణకోసం సిద్ధమవుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News