చంద్రబాబుకు కొత్త తలనొప్పి మొదలవుతోందా?

తాము పోటీ చేయబోయే నియోజకవర్గం పొత్తుల్లో పోతుందని అనుమానం వచ్చిన కొందరు సీనియర్లు వెంటనే పక్క నియోజకవర్గంలో పోటీకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు.

Advertisement
Update:2023-08-21 10:46 IST

రాబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ నేతల్లో పూర్తి అయోమయాన్ని పెంచేస్తున్నాయి. ఎందుకంటే జనసేనతో పొత్తు దాదాపు ఖాయమనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఎన్నోకొన్ని సీట్లు వదులుకోవాల్సుంటుందని చాల కాలంగా అనుకుంటున్నదే. అయితే ఆ కొన్నే ఎన్నో తెలీటంలేదు. పైగా వదులుకోవాల్సిన సీట్లు కూడా ఏవో అర్థంకావటంలేదు. దీనికి అదనంగా బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటి రావటంలేదు. బీజేపీతో పొత్తుంటే మరిన్ని సీట్లను వదులుకోవాల్సిందే. దాంతో ఈ పార్టీకి వదులుకోవాల్సిన సీట్లెన్ని, ఏవి అనే విషయంలో తమ్ముళ్ళల్లో అయోమయం పెరిగిపోతోంది.

అందుకని ఎందుకైనా మంచిదని సీనియర్లలో చాలామంది రెండు నియోజకవర్గాలపైన కర్చీఫ్ వేస్తున్నారట. తాము పోటీ చేయబోయే నియోజకవర్గం పొత్తుల్లో పోతుందని అనుమానం వచ్చిన కొందరు సీనియర్లు వెంటనే పక్క నియోజకవర్గంలో పోటీకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నారు. ఉదాహరణకు గంటా శ్రీనివాస్ విషయం తీసుకుంటే రాబోయే ఎన్నికల్లో భీమిలీ నుండి పోటీకి రెడీ అవుతున్నారట. అయితే ఈ స్థానాన్ని జనసేన బలంగా కోరుకుంటోంది. అందుకని ఇక్కడ అవకాశం దొరుకుతుందో లేదో తెలీదు కాబట్టి చోడవరంలో పోటీకి గంటా రెడీ అయిపోతున్నారు.

ఇక విశాఖ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన భరత్ రాబోయే ఎన్నికల్లో కూడా మళ్ళీ వైజాగ్ ఎంపీగానే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా బాగా తిరుగుతున్నారు. అయితే బీజేపీతో పొత్తులో పోటీచేసే అవకాశం పోతుందనే అనుమానం పెరిగిపోతోందట. అందుకనే ప్రత్యామ్నాయంగా అనకాపల్లి ఎంపీతో పాటు మరో అసెంబ్లీ నియోజకవర్గంపై కన్నేశారట.

ఇదే పద్ధ‌తి ఉభయగోదావరి, రాయలసీమ జిల్లాల్లో కూడా కనబడుతోందట. చేస్తే తమ నియోజకవర్గంలో పోటీ చేయాలని లేకపోతే ప్రత్యామ్నాయంగా ఎంపీ లేదా మరో అసెంబ్లీ నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలని సీనియర్లు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. సీనియర్ల వల్ల పక్క నియోజకవర్గాల్లో ఉండే ఆశావహుల్లో ఇబ్బందులు మొదలవుతున్నాయట. దాంతో పొత్తుల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయే సీనియర్లను ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక చంద్రబాబు తలపట్టుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా పొత్తులు చంద్రబాబుకు బాగా ఇబ్బందులను తెచ్చెపెట్టడం ఖాయమనే అనిపిస్తోంది. మరీ ఈ ప‌రిస్థితిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News