బీజేపీతో పొత్తు.. బాబు, పవన్‌ల సెల్ఫ్‌గోల్‌

ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు బాబు, పవన్‌ల కూటమికి దూరంగా జరుగుతారు. బీజేపీతో వారి అనైతిక పొత్తును టీడీపీ, జనసేనల అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement
Update:2024-03-10 10:46 IST

ఆధునిక రాజకీయాల్లో హత్యల కన్నా ఆత్మహత్యలే ఎక్కువ. బీజేపీ, టీడీపీ, జనసేనల పొత్తు అంతిమంగా వైసీపీకి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు కాస్తో కూస్తో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ల మీద నమ్మకమున్న ఓటర్లు దూరం జరిగే ప్రమాదం పొంచివుంది. బీజేపీతో జతకట్టి ఎన్డీయేలో చేరడం ద్వారా తమ బలం పెరుగుతుందని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నాయి. కానీ, ఇది వారి బలహీనతని చెప్పకనే చెబుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్డీయేతో జతకట్టడం ద్వారా చంద్రబాబు, పవన్‌లు సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్టయింది.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో బీజేపీ ఎలాంటి ప్రభావిత పాత్రను పోషించే అవకాశం ఇప్పటికీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఐదేళ్ళలో ఆ పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. బీజేపీ జాతీయ పార్టీయే కావచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో దాని ఉనికి శూన్యం. తెలంగాణలోనైనా బీజేపీ గత పదేళ్ళ కాలంలో పుంజుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అడుగు ముందుకు వేసింది లేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు టీడీపీకి, జనసేనకు లాభించకపోగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది.

ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు బాబు, పవన్‌ల కూటమికి దూరంగా జరుగుతారు. బీజేపీతో వారి అనైతిక పొత్తును టీడీపీ, జనసేనల అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. ముస్లిం ఓటర్లు, క్రిస్టియన్‌ ఓటర్లు పూర్తిగా టీడీపీని పక్కన పెడతారు. ఇప్పటికే ఈ రెండు వర్గాలవారిలో అధికభాగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా వున్నారు. తటస్థంగా వున్నవారు ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు ఇచ్చే అవకాశముంది. మత రాజకీయాలకు పాల్పడే బీజేపీతో జతకట్టిన వారిని ఈ వర్గాలు క్షమించే అవకాశం లేదు. కనుక ఈ వర్గాలకు చెందిన ఓటర్లంతా ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఇప్పటికే మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వానికి మరోసారి పట్టం గడతారు.

ఇక వామపక్షాల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకల్లా తయారయింది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్న వామపక్షాలు వారికి దూరంగా జరగకతప్పదు. బీజేపీతో జతకట్టిన బాబు, పవన్‌లతో తెగదెంపులు చేసుకోడం సీపీఐ, సీపీఎం పార్టీలకు అనివార్యం. ముఖ్యమంత్రిగా జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్రమంత్రులను కలిసారే తప్ప, రాజకీయ లబ్ది కోసం బీజేపీతో ఎన్నడూ జతకట్టలేదు. ఈ పరిస్థితి వామపక్షాలకే కాదు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలుసు. ఈ పరిస్థితిలో కేంద్రంలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వామపక్షాలు బాబు, పవన్‌లకు ఓటు వేయాల్సిందిగా చెప్పలేవు. చెబితే మరింత అభాసు పాలవుతామని వారికి తెలుసు.

ఆంధ్రప్రదేశ్‌లో మతప్రాతిపదికన ఓటు వేయడమనే పరిస్థితి ఎప్పుడూ లేదు. హిందూత్వ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను జనాలు క్షమించరు. ఇప్పటికే దళితులు జగన్‌ పక్షాన ఉన్నారు. చంద్రబాబుతో కలిసిన పవన్‌ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదని కాపు ఓటర్లు భావిస్తున్నారు. హిందూత్వ పేరుతో ఓట్లు అడుగుదామన్నా ఏపీలో మతాలకు, మంత్రాలకు చింతకాయలు రాలవు. కనుక ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే ఎన్డీయేలో చంద్రబాబు, పవన్‌లు చేరడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మార్గం మరింత సులువైందని పరిశీలకులు అంటున్నారు. మరోసారి జగన్‌ అధికారం చేపట్టడమే రాష్ట్రానికి, తమకు లాభమని ప్రజలు కచ్చితంగా భావించే పరిస్థితి నెలకొనడం కీలక పరిణామం.

Tags:    
Advertisement

Similar News