వీళ్ళే జగన్‌కు ప్రచారం చేస్తున్నారా?
జగన్‌ను టార్గెట్ చేస్తున్నామని ప్రతిపక్ష పార్టీలు, ఎల్లో మీడియా సంబరపడుతున్నాయి. అయితే ఇక్కడే ఒక విషయాన్ని మరచిపోతున్నాయి.
రాష్ట్ర రాజకీయాలు చాలా విచిత్రంగా తయారయ్యాయి. ప్రతిపక్షాలన్నీ కలిసి అంటే పొత్తులు పెట్టుకోకుండానే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి. పట్టుమని పది ఓట్లు పడతాయో లేదో తెలీని సీపీఐ కూడా పదేపదే జగన్‌పై ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతోంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్ది ఇలాంటి టార్గెట్లు మరింత ఎక్కువైపోవటం ఖాయం. ప్రతిపక్షాలు జగన్‌కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్నట్లు సంబరపడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మరచిపోతున్నాయి.
అదేమిటంటే తామే జగన్‌కు ప్రచారం చేస్తున్నామని. ఒకవైపు చంద్రబాబునాయుడు, మరోవైపు పవన్ కల్యాణ్, ఇంకో వైపు దగ్గుబాటి పురందేశ్వరి, చివరకు ఎల్లోమీడియా ప్రతిరోజు జగన్‌కు వ్యతిరేకంగా టన్నుల కొద్ది ఆరోపణలు చేస్తున్నాయి, అచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే జగన్‌ను సీన్‌లోకి లాగేస్తున్నాయి. తిరుమల కొండకు నడిచి వెళ్ళే దారిలో చిరుతపులి లక్షిత అనే బాలికను చంపేస్తే దానికి కూడా జగన్‌దే తప్పని మాట్లాడుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు నిర్వహించిన యుద్ధభేరి ఆద్యంతం జగన్‌ను టార్గెట్ చేస్తునే ఉన్నారు. విచిత్రం ఏమిటంటే తన ఫెయిల్యూర్లను కూడా జగన్ ఖాతాలో వేసి చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు. ఇక వారాహి యాత్రలో పవన్ పదేపదే జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. అప్పుల విషయంలో, ఇళ్ళ నిర్మాణాల విషయంలో పురందేశ్వరి టార్గెట్ కూడా జగనే. ఇక ఎల్లో మీడియాలో జగన్‌ను టార్గెట్ చేయకుండా వార్తలు, కథనాలను ఊహించలేం.
ఈ విధంగా అందరు కలిసి జగన్‌కు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. జగనేమో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంచుకుంటు, మధ్యమధ్యలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసుకుంటున్నారు. వీళ్ళెవరినీ జగన్ అసలు లెక్క కూడా చేయటంలేదు. పది రోజులకు ఒకసారి ఎక్కడో సభ నిర్వహించి ప్రతిపక్షాలపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. మరి వీళ్ళేమో నెలరోజులూ జగన్‌ను టార్గెట్ చేస్తునే ఉన్నారు. జగన్‌పై చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు పట్టించుకుంటున్నారా? లేకపోతే అందరూ కలిసి ఒక్కడిని చేసి జగన్‌ను ఇబ్బందులు పెడుతున్నారనే సానుభూతిని పెంచేస్తున్నారా?