వివేకా కేసులో నా వాంగ్మూలం తొలగించండి..

వైఎస్ వివేకా కేసులో ఇటీవల దర్యాప్తు అధికారులపై అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజేయకల్లం కూడా వాంగ్మూలం తీసుకునే క్రమంలో సీబీఐ సరిగా వ్యవహరించలేదంటున్నారు. తానొకటి చెబితే, వారొకటి నోట్ చేసుకున్నారని చెప్పారు.

Advertisement
Update:2023-07-29 08:10 IST

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ఉన్న తన వాంగ్మూలాన్ని తొలగించాలంటూ ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయకల్లం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చార్జిషీట్‌ లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారని ఆరోపించారాయన. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయ­డం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

అజేయకల్లం ఏం చెప్పారంటే..?

"వైసీపీ మేనిఫెస్టో సమావేశం 2019 మార్చి 15న ఉదయం 5 గంటలకు వైఎస్‌ జగన్‌ ఇంట్లో ప్రారంభమైంది. అరగంట తర్వాత ఒక అటెండర్‌ సమావేశగది తలుపు తట్టాడు. బయటికి వెళ్లి విషయం తెలుసుకుని వచ్చిన ఓఎస్డీ.. జగన్‌ చెవిలో ఏదో చెప్పారు. దీంతో జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురయ్యారు. ‘చిన్నాన్న చనిపోయారు’ అని చెప్పారు." తాను సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇదీ అంటున్నారు అజేయకల్లం.

సీబీఐ చార్జి షీట్ లో పేర్కొన్నదేంటి..?

"2019 మార్చి 15న ఉదయం 5.30 గంటల సమయంలో అటెండరు వచ్చి అమ్మ (భారతి) పిలుస్తున్నారంటూ జగన్‌ కు చెప్పారు. బయటకు వెళ్లిన జగన్‌ పది నిమిషాల తరువాత తిరిగివచ్చి చిన్నాన్న ఈజ్‌ నో మోర్‌ అని అన్నారు. షాక్‌ కు గురైన మేము కడపకు వెళ్లాలని ఆయనకు సూచించి బయటకు వచ్చేశాము." తాను భారతి పేరు చెప్పకపోయినా సీబీఐ చార్జిషీట్ లో ఆమె నుంచి పిలుపు వచ్చినట్టు నమోదు చేసిందని, ఆ వాంగ్మూలం తప్పు అంటున్నారు అజేయకల్లం.

సీబీఐ చార్జిషీట్ లో పేర్కొన్నదేంటి అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ లేదని, పత్రికల్లో చూసి తాను ఆ విషయం తెలుసుకున్నానని, అది కూడా పూర్తిగా వక్రీకరించారని అన్నారు. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా పేర్కొన్నదని ఆరోపించారు అజేయకల్లం. అందుకే దాన్ని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వైఎస్ వివేకా కేసులో ఇటీవల దర్యాప్తు అధికారులపై అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అజేయకల్లం కూడా వాంగ్మూలం తీసుకునే క్రమంలో సీబీఐ సరిగా వ్యవహరించలేదంటున్నారు. తానొకటి చెబితే, వారొకటి నోట్ చేసుకున్నారని చెప్పారు. తన వాంగ్మూలం తీసుకున్న తర్వాత తిరిగి తనకు చూపించలేదని ఆరోపిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News