సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలి మెతుకులు..

సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలి మెతుకులు విసిరేస్తూ నిత్యావసర సరుకుల ధరలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ. మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా హిందూపురం పట్టణంలో పేద ప్రజలకు భోజనం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement
Update:2022-10-16 20:27 IST

ఏపీలో సంక్షేమ పథకాలపై టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తామని చెప్పే సాహసం కూడా చేయలేదు. అయితే తొలిసారి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంక్షేమ పథకాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఎంగిలి మెతుకులంటూ మండిపడ్డారు. ఇటీవల అన్ స్టాపబుల్ షో తో టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిన బాలయ్య.. ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఇక్కడ ఇల్లు కాలుతుంటే.. అక్కడ..

హిందూపురం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వరద పరిస్థితులను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. స్థానిక నాయకులు, అధికారులతో సమస్యను తెలుసుకుని కలెక్టర్‌తో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించానన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజా ప్రతినిధి వచ్చి పలకరించిన పాపాన పోలేదని బాలకృష్ణ మండిపడ్డారు. ఇక్కడ అనంతపురం అతలాకుతలం అవుతుంటే, అక్కడ గర్జనల పేరుతో వైసీపీ నాయకులంతా విశాఖలో చేరారని విమర్శించారు.

ప్రజలే బుద్ధి చెబుతారు..

సంక్షేమ పథకాల పేరుతో ఎంగిలి మెతుకులు విసిరేస్తూ నిత్యావసర సరుకుల ధరలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాలకృష్ణ. మొబైల్ అన్న క్యాంటీన్ ద్వారా హిందూపురం పట్టణంలో పేద ప్రజలకు భోజనం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేసింది తామేనని స్పష్టం చేశారు. తానెక్కడున్నా హిందూపురం అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ రోడ్డుపై ఒక గుంత కూడా పూడ్చలేదన్నారు. భూకబ్జాలు, నేరాలు తప్ప అభివృద్ధి లేదన్నారు బాలకృష్ణ. హిందూపురం ప్రశాంతతకు మారుపేరని, అలాంటి హిందూపురంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని చెప్పారు. రాజకీయాల్లో జయాపజయాలు దైవాధీనాలు అని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు బాలయ్య.

Tags:    
Advertisement

Similar News