ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజ..
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి 48.16, టీడీపీ కూటమికి 46.49, ఇతరులకు 5.35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ టీడీపీ కూటమిపై కేవలం 1.67 శాతం ఓట్ల ఆధిక్యతలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి, ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ముందంజలో ఉన్నట్టు వెల్లడైంది. ఏపీలో ఎస్సీ, ఎస్టీ నియోజవర్గాలు మొత్తం 36 ఉన్నాయి. అందులో 29 ఎస్సీ నియెజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ఆధిక్యత ఉన్న పార్టీలే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్టు గత మూడు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
పీపుల్స్‌పల్స్ సంస్థ 30 మార్చి నుండి 3 ఏప్రిల్ 2024 వరకు ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ట్రాకర్‌పోల్ ప్రకారం టీడీపీ కూటమి 19, వైఎస్‌ఆర్‌సీపీ 10 ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, టీడీపీ కూటమి 2, వైఎస్‌ఆర్‌సీపీ 5 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు వెల్లడైంది. పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమికి 51.81, వైఎస్‌ఆర్‌సీపీకి 42.83, ఇతరులకు 5.36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి వైఎస్‌ఆర్‌సీపీపై 8.98 శాతం ఓట్ల ఆధిక్యతలో ఉంది.
పీపుల్స్ పల్స్ సంస్థ సర్వే ప్రకారం ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి 48.16, టీడీపీ కూటమికి 46.49, ఇతరులకు 5.35 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ టీడీపీ కూటమిపై కేవలం 1.67 శాతం ఓట్ల ఆధిక్యతలో ఉంది.
ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పీపుల్స్ పల్స్ సంస్థ ట్రాకర్ పోల్‌ను మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు 36 రిజర్వుడ్ అసెంబ్లీ సెగ్మంట్లలో, 180 పోలింగ్ స్టేషన్లలో, 3,960 సాంపిల్స్‌తో నిర్వహించింది. 36 ఎస్సీ, ఎస్టీ సెగ్మెంట్లు రిజర్వుడ్‌గా ఉన్నా వీటిలో 7 స్థానాల్లో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు, 6 స్థానాల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు, మరో 6 స్థానాల్లో కమ్మ సామాజికవర్గం ఓటర్లు , ఇతర బలహీనవర్గాల ఓటర్లు 8 స్థానాల్లో నిర్ణయాత్మకంగా ఉన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడడంతో ఎస్సీ స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తున్నాయి.
రాష్ట్రంలోని 36 రిజర్వుడ్ స్థానాలు మొత్తం 137 మండలాలు, 6 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో 14 మండలాలు వైఎస్‌ఆర్‌సీపీకి పూర్తి పట్టున్నవి కాగా, 16 మండలాల్లో కూటమి ముఖ్య భాగస్వాములైన టీడీపీ`జనసేన పార్టీలకు పట్టుంది. మిగతా చోట్ల పోటాపోటీగా ఉంది. మొత్తంగా ఓటు షేరు కూటమికి అనుకూలంగా ఉన్నట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. సబ్‌ప్లాన్ నిధులు మళ్లింపు, ఉద్యోగాలు లేవకపోవడం, రుణాలు సరిగ్గా లభించకపోవడం వంటి కారణాలతో ఎస్సీ నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతికూలంగా ఉంది. పీపుల్స్‌పల్స్ సంస్థ 2019 ఎన్నికలకు ముందు కూడా ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది.