మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
మంత్రిగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని గతంలోనే టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి.
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఈ ఉదయం నుంచి సోదాలు మొదలు పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15మంది అధికారులు, సిబ్బంది సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. సోదాలపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అటు జోగి రమేష్ కూడా స్పందించలేదు.
అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అక్రమంగా తక్కువ రేటుకి కొనేశారని, తన పేరుపై, కుటుంబ సభ్యుల పేరుపై వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అక్రమాలు బయటపడకుండా తిరిగి వాటిని అమ్మేశారనేది జోగి రమేష్ పై ఉన్న ఆరోపణ. మంత్రిగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారని గతంలోనే టీడీపీ నేతలు ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, అగ్రిగోల్డ్ వ్యవహారంలో ప్రభుత్వం తనను ఇరుకున పెడుతుందని జోగి రమేష్ ముందుగానే అనుమానించారు. తనను అరెస్ట్ చేసినా సిద్ధమేనన్నారు. ఆ భూములన్నీ తాను సక్రమంగానే కొన్నానని చెప్పారు. ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని అన్నారు జోగి రమేష్. తనను జైలులో పెట్టినా తగ్గేది లేదంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.