వాలంటీర్ వ్యవస్థ రద్దు.. ఏపీ హైకోర్టులో పిటిషన్

చంద్రబాబు ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలోనే వాలంటీర్లకు షాకిచ్చింది. వృద్ధుల, వికలాంగుల పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Update: 2024-06-26 15:30 GMT

ఏపీలో వాలంటీర్లను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయా.. అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా వాలంటీర్లను తొలగించాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అడ్వకేట్ ఉన్నం శ్రవణ్‌ కుమార్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాలంటీర్ల నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం తొలి కేబినెట్‌ సమావేశంలోనే వాలంటీర్లకు షాకిచ్చింది. వృద్ధుల, వికలాంగుల పెన్షన్ పంపిణీ బాధ్యతల నుంచి వాలంటీర్లను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ల పంపిణీ బాధ్యతను సచివాలయ సిబ్బందికి అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాలంటీర్ల భవితవ్యం గందరగోళంలో పడింది.

ఏపీ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొంత మంది వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. వారంతా మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ చంద్రబాబు సర్కార్ మాత్రం ఈ విషయంపై తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం ఈ అంశం కూడా కోర్టు పరిధిలోనే ఉంది.

నిజానికి గతంలో వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేశారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థను గోనె సంచులు మోసే ఉద్యోగాలు అంటూ హేళనగా మాట్లాడారు. మగాళ్లు లేని టైంలో మహిళలు ఇంట్లో ఒంట‌రిగా ఉన్న స‌మ‌యంలో వాలంటీర్లు తలుపులు కొడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కానీ, ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. వారికిచ్చే ప్రోత్సాహకం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ తాజాగా వాలంటీర్లను పూర్తిగా తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం అనుమానాలకు దారి తీస్తోంది. ఐతే ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్‌పై ఆసక్తి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News