కోటంరెడ్డికి అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసిన రాధాకృష్ణ
తనను ఆయన వద్దనుకున్నప్పుడు ఈ సీఎం కాకుంటే మరో సీఎం అవుతారులే అని తాను ఫోన్‌లో మాట్లాడింది నిజమేనన్నారు. రామోజీరావు ఇంటికి జగన్ వెళ్లినప్పుడు మంచి పని చేశారు.. అలాగే రాధాకృష్ణ ఇంటికి కూడా వెళ్లండి అని చెప్పానన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని చాలా గట్టిగానే వైసీపీ మీదకు ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అప్పుడే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేసేశారు. కోటంరెడ్డికి సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమోను బయటకు వదిలారు.
ఎవరు లేనప్పుడు తాను నిలబడ్డా.. ఓదార్పు యాత్రలో ఉన్నా, జగన్ కుటుంబం కోసం నిలబడ్డా అయినా పార్టీలో ఏమాత్రం ప్రాధాన్యత లేదన్నారు. అయినా ఓర్చుకున్నానని, భరించానని.. ఇప్పుడు తన ఫోనే ట్యాపింగ్ చేసిన తర్వాత ఇక ఉండలేకపోయానన్నారు. తనపై వేరే పార్టీ వాళ్లు ట్యాపింగ్ ప్రయోగం చేసి ఉంటే అస్సలు పట్టించుకునే వాడిని కాదన్నారు. తాను జగన్‌ను ఒక నాయకుడిగా కాకుండా ఒక నెల్సన్ మండేలా, ఒక చెగువేరా, ఒక భగత్ సింగ్, ఒక బోస్ అన్నట్టుగా ఆరాధించానని చెప్పారు. అమరావతి రైతులను పరామర్శించడంతో తనకు వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని వివరించారు.
తనను ఆయన వద్దనుకున్నప్పుడు ఈ సీఎం కాకుంటే మరో సీఎం అవుతారులే అని తాను ఫోన్‌లో మాట్లాడింది నిజమేనన్నారు. రామోజీరావు ఇంటికి జగన్ వెళ్లినప్పుడు మంచి పని చేశారు.. అలాగే రాధాకృష్ణ ఇంటికి కూడా వెళ్లండి అని చెప్పానన్నారు. అందుకు రాధాకృష్ణ.. జగన్ కలిసేందుకు వస్తానని చెప్పినా తానే వద్దని చెప్పానని.. జగన్, తాను ఉత్తర,దక్షిణ ధృవాలమన్నారు. జగన్ మీ మీద కక్ష కట్టే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్నకు.. ప్రభుత్వాలు అనుకుంటే ఏమైనా చేయవచ్చు.. ఎన్‌కౌంటర్ కూడా చేయవచ్చన్నారు. 21ఏళ్ల వయసులోనే నేను జైలు చూశాను.. లాకప్‌లు చూశాను, లాఠీ దెబ్బలు తిన్నానన్నారు కోటంరెడ్డి. అన్నింటికి సిద్ధమయ్యే నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తనకు ఏ పార్టీ సీటు ఇవ్వకపోతే బీఆర్‌ఎస్ అనే ఆప్షన్ కూడా ఉందన్నారు. ఇంత వెంటనే ఇంటర్వ్యూ కూడా చేయడం బట్టి వైసీపీ వ్యతిరేకులను కూడగట్టడంలో ప్రతిపక్షం చాలా చురుగ్గానే వ్యవహరిస్తున్నట్టుగా ఉంది.