చంద్రకి చెంపదెబ్బ – బాబుకి గోడదెబ్బ..!

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెరవెనక చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. చంద్రబాబు పట్ల కఠినంగా ఉండడమే బీజేపీ వైఖరి అని స్పష్టం అవుతోంది.

Advertisement
Update:2024-02-16 06:30 IST

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో ఆ రోజు అమిత్‌ షా ఏం మాట్లాడారు..? ఒక సర్‌ప్రైజ్, ఒక షాక్‌.. అనే అనిపిస్తోంది. ఆ మీటింగ్‌ తర్వాత బాబు సైలెంట్‌ అయిపోయారు. పొత్తు మీద మాటల్లేవు. సీట్ల పంపకం ముచ్చట లేదు. పవన్‌ కళ్యానూ మాట్లాడడు. చంద్రబాబూ పెదవి విప్పడు. అటు లోకేష్‌బాబూ ఏమీ చెప్పడు. ఏమిటీ సస్పెన్స్‌..?

అమిత్‌ షా, బాబు సమావేశం జరిగిన మర్నాడే ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి జగన్‌ మీటింగ్‌ జరిగింది. దాదాపు గంటన్నరసేపు మాట్లాడుకున్నారు. జగన్‌ పూర్తి సంతృప్తితో, చిరునవ్వులతో బయటికి వచ్చారు. రాజకీయ గేమ్‌ రక్తికట్టినట్టుగానే ఉంది. చంద్రబాబుకి పచ్చి వెలగ గొంతులో పడినట్టే ఉంది.

50 అసెంబ్లీ సీట్లు జనసేనకీ, 25 సీట్లు భారతీయ జనతా పార్టీకీ ఇవ్వాలని బాబుకి స్పష్టంగానే చెప్పారని అంటున్నారు. అదే నిజమైతే, అది బాబుకి ఊహించని దెబ్బ. గెలిస్తే, రెండున్నరేళ్లు పవన్‌ని ముఖ్యమంత్రిని చేయాలనీ చెప్పినట్టున్నారు. ఇదే గనక నిజమైతే చంద్రబాబుకి దెబ్బ మీద దెబ్బ..!

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో తెరవెనక చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. చంద్రబాబు పట్ల కఠినంగా ఉండడమే బీజేపీ వైఖరి అని స్పష్టం అవుతోంది. ఈ అంతుచిక్కని గేమ్‌లో పవన్‌ కళ్యాణ్‌దే పైచేయి అయినా ఆశ్చర్యం లేదు. అందుకే, ఇప్పటికీ సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు. ఇది తుఫాన్‌ ముందు ప్రశాంతత. బీజేపీ నిబ్బరంగా ఉంది. పవర్‌స్టార్‌ ధీమాగా ఉన్నారు. చంద్రబాబుని అశాంతి ఆవరించుకొని ఉంది. జగన్ని గద్దె దింపాలనే తొందరపాటులో తెలుగుదేశం ఎక్కువ పిల్లిమొగ్గలు వేసి గాయపడినట్టుంది. రాజకీయ బేరం కుదిరినట్టే కుదిరి, చివరి క్షణంలో బెడిసి కొట్టినట్టు కనిపిస్తోంది.

జనాదరణతో నిర్భయంగా ఉన్న జగన్ని తట్టుకోవడం ఎలా..? అని కంగారుపడుతున్న సమయంలో శక్తివంతమైన బీజేపీ వచ్చి షరతులూ, డిమాండ్లూ, మెలికలూ పెట్టింది. ఎన్నికలు వస్తున్నాయంటూ సీట్లు పంచుకోగానే సంబరంకాదు. ఎక్కడెక్కడ, ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి..? ఎమ్మెల్యే స్థానానికి ఎవరు..? ఎంపీ సీటుకి ఎవరు..? బేరం ఎన్ని కోట్లకి..? ఏ కులానికి ఎన్ని సీట్లు..? అటు దళితులూ ఊరుకోరు, కాపులూ ఊరుకోరు, బీసీలకు న్యాయం అని కొందరు, ముస్లింలు కనిపించరా..? అని మరికొందరు.. ఇది ఒక బాధ అయితే, దాదాపు 70 సీట్ల దాకా జనసేన బీజేపీలకు పోతే, ఆ నియోజకవరాల్లో పాతుకుపోయి ఉన్న తెలుగుదేశం నాయకులు ఊరుకుంటారా..? మేం 30 ఏళ్లు పార్టీలో ఉంటే, రెండు శాతం ఓట్లు కూడారాని బీజేపీకి ఆ సీటు ఇచ్చేస్తారా..? మేం బీజేపీ కోసం పనిచెయ్యాలా..? లేదా పవన్‌ కళ్యాణ్‌ అనే సినిమా యాక్టర్ని గెలిపించాలా అని నిలదీస్తారు. అయినా చమత్కారం ఏమిటంటే.. చంద్రబాబుకి ఈ దుర్గతి పట్టడానికి చంద్రబాబే కారణం.

పదవి పదవంటూ పరితపించి, పచ్చి వ్యాపారస్తునిగా బరితెగించి, ఎన్నుకున్న ప్రజలనే పరిహసించి, చివరికి అమిత్‌షా కాళ్లకి నమస్కరించి.... ఇదంతా రాజకీయాల నుంచి నిష్క్రమించడానికేనా..!

Tags:    
Advertisement

Similar News