గంటా నాయకత్వంలో కాపులకోసం ప్రత్యేక పార్టీ..?

పార్టీ పెట్టేది కాపులే అయినా, కాపులకోసమే అయినా అవసరమైనచోట్ల ఇతర సామాజికవర్గాల్లోని ప్రముఖులకు కూడా టికెట్లిచ్చే విషయాన్ని సమావేశాల్లో ఆలోచిస్తున్నారు.

Advertisement
Update:2022-11-04 11:39 IST

కాపు సామాజికవర్గం కోసం ప్రత్యేకంగా ఒకపార్టీ తొందరలోనే ఏర్పాటు కాబోతోంది. వచ్చే ఏడాదిలో అంటే సంక్రాంతి పండుగ ప్రాంతంలో పార్టీ ఏర్పాటుకు సంబంధించి ఒక షేప్ తయారవచ్చు. కాపుల కోసం ప్రత్యేకంగా ఒకపార్టీ పెట్టేందుకు ఇప్పటికే కొందరు ప్రముఖులు సమావేశాలు అయిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తమిళనాడు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు, లాయర్ ఆరేటి ప్రకాష్ ఆధ్వర్యంలో ఇప్పటికే మీటింగులు జరిగాయి.

ఈ సమావేశాలకు సంధానకర్తగా రాజ్యసభ మాజీ ఎంపీ మింటె పద్మనాభం అల్లుడు, లాయర్ ఆరేటి ప్రకాష్ వ్యవహరిస్తున్నారు. సామాజికవర్గంలోని ప్రముఖులతో ప్రకాషే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీబీఐ జాయింట్ డైరెక్టరుగా పనిచేసిన లక్ష్మీనారాయణతో కూడా భేటీ జరిగింది. ఇక్కడ విషయం ఏమిటంటే ఇతరపార్టీల్లో చేరి టికెట్లకోసం కాపులు నానా అవస్తలు పడేబదులు అచ్చంగా కాపులకోసమే సొంతంగా ఒకపార్టీ పెట్టుకుంటే ఎలాగుంటుందనే ఆలోచనతోనే ప్రముఖులంతా కలుస్తున్నారు.

పార్టీ పెట్టేది కాపులే అయినా, కాపులకోసమే అయినా అవసరమైనచోట్ల ఇతర సామాజికవర్గాల్లోని ప్రముఖులకు కూడా టికెట్లిచ్చే విషయాన్ని సమావేశాల్లో ఆలోచిస్తున్నారు. సామాజికవర్గంలోని ప్రముఖులంతా అసలు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)లో చేరితే ఎలాగుంటుందనే ఆలోచన వచ్చినా తర్వాత ప్రత్యేకించి ఒకపార్టీ పెట్టడమే బాగుంటుందని తీర్మానించారు. బహుశా వచ్చే ఏడాదిలోనే పార్టీ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. అలాగే పార్టీ నాయకత్వ బాధ్యతలను మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గంటాకు విశాఖపట్నం జిల్లాతో పాటు రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో యాక్సెప్టెన్సీ ఎక్కువగా ఉందన్నది ప్రముఖుల ఆలోచన. పైగా అందరికన్నా ఆర్ధిక, అంగ బలంలో గంటా చాలా గట్టిస్ధితిలో ఉన్నారు. అందుకనే కొత్తగా ఏర్పాటవ్వబోయే పార్టీకి గంటాయే నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సంక్రాంతి పండుగలోగా ప్రాంతాలవారీగా కొన్ని సమావేశాలు నిర్వహించే ఆలోచన జరుగుతోంది. ఒకసారి పార్టీ ఏర్పాటైన తర్వాత పార్టీలో చేరబోయే నేతలు, ప్రముఖుల వివరాలను ప్రకటించే అవకాశముంది. కొత్తగా ఏర్పాటవ్వబోయే పార్టీ జనసేనకు పోటీయా కాదా అన్నవిషయం సంక్రాంతి తర్వాత కానీ తెలియదు.

Tags:    
Advertisement

Similar News