జగనన్నకోసం కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం..

రాజు వీడియో మెసేజ్ చూసిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఆ కుటుంబాన్ని కాపాడేందుకు గామన్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు.

Advertisement
Update:2024-06-12 07:44 IST

వైసీపీ ఓటమిని తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. గోదావరి నదిలో దూకి చనిపోవాలనుకున్న వారిని పోలీసులు రక్షించారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న ఆ కుటుంబం ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడింది. ఏపీలో రీపోలింగ్ జరగాలని, తాము చనిపోతే అయినా ఆ పని చేస్తారేమోనని, అందుకే ఆత్మహత్యకు ప్రయత్నించామని అంటున్నారు కుటుంబ పెద్ద తాళ్లూరి రాజు.

ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఏపీలో వైసీపీ ఓటమిచెందిందని అంటున్నారు తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మ­ణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు. భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం లోపే తామంతా చనిపోవాలని అనుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన రాష్ట్రపతికి తెలిస్తే ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మిత్రులకు పంపించారు. ఆ తర్వాత గోదావరి నదిపై ఉన్న గామన్‌ బ్రిడ్జిపైకి ఎక్కారు.

రాజు వీడియో మెసేజ్ చూసిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఆ కుటుంబాన్ని కాపాడేందుకు గామన్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. రాజు కుటుంబాన్ని వారంతా కలసి కాపాడారు. తామంతా వైసీపీకే ఓటు వేశామని, అయినా ఆ పార్టీ ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదన్నారు రాజు. తమ చావుతోనైనా ఎన్నికల ఫలితాలపై విచారణ చేస్తారని భావించామన్నారు. ఈసారి బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారన్నారు. జగన్ పథకాలతో తమ కుటుంబమంతా లబ్ధిపొందామన్నారు రాజు. 

Tags:    
Advertisement

Similar News