ఏపీఐఐసీలో ఎదురుతిరిగిన డైరెక్టర్లు
ఏపీఐఐసీలో ముగ్గురు అధికారుల తీరుపై డైరెక్టర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఆ ముగ్గురు ఏపీఐఐసీలో పాతుకుపోయి చైర్మన్, ఎండీ నిర్ణయాలను కూడా ఖాతరు చేయడం లేదని చెబుతున్నారు.
ఏపీఐఐసీలో అధికారులకు, డైరెక్టర్లకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి పరిస్థితిని చక్కదిద్దేందుకు సతమతవుతున్నారు. అధికారుల తీరును ఇంతకాలం మౌనంగా భరించిన డైరెక్టర్లు మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఎదురుతిరిగారు. అసలేం జరుగుతోంది అని ప్రశ్నించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేయడం, నిర్ణయాలపై తమ సంతకాలు తీసుకోవడం తప్ప.. అసలు ఏ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో కూడా వివరించడం లేదని డైరెక్టర్లు అభ్యంతరం తెలిపారు.
ఒకదశలో ''ఇక సంతకాలు కూడా మీరే చేసుకుండి.. మేం వెళ్లిపోతాం'' అంటూ సమావేశం నుంచి బయటకు వచ్చేందుకు డైరెక్టర్లు మూకుమ్మడిగా సిద్ధమయ్యారు. అసలు ఈ సమావేశాలకు తాము రావాల్సిన అవసరం ఉందా లేదా అన్న దానిపై బయటకు వెళ్లి చర్చించుకుంటామని డైరెక్టర్లు పైకి లేచారు. అప్పుడు గానీ అధికారుల్లో కంగారు మొదలుకాలేదు. డైరెక్టర్లను శాంతపరించేందుకు ప్రయత్నించారు. మీరు వెళ్లవద్దు.. మేమే కాసేపుబయటకు వెళ్తాం.. ఇబ్బందులు ఉంటే చర్చించుకుని చెప్పండి సరిచేసుకుంటామని అధికారులు విజ్ఞప్తి చేశారు. డైరెక్టర్లు చర్చించుకునేందుకు వీలుగా అధికారులు కాసేపు బయటకు వెళ్లారు.
ఏపీఐఐసీలో ముగ్గురు అధికారుల తీరుపై డైరెక్టర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఆ ముగ్గురు ఏపీఐఐసీలో పాతుకుపోయి చైర్మన్, ఎండీ నిర్ణయాలను కూడా ఖాతరు చేయడం లేదని చెబుతున్నారు. ఏపీఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న సృజనకు కూడా ఈ ముగ్గురు అధికారులు సహకరించడం లేదన్న విమర్శ ఉంది. అంతా తాము అనుకున్నట్టే జరగాలి అన్నట్టుగా ఏపీఐఐసీని వీరు శాసిస్తున్నారని డైరెక్టర్లు ఆరోపిస్తున్నారు.
డిప్యూటేషన్‌పై వచ్చి ఏపీఐఐసీని శాసిస్తున్న ఒక మహిళా అధికారిణికి సంబంధించి బదిలీకి సీఎం ఆదేశించినా సరే ఆమె అక్కడి నుంచి కదలడం లేదని చెబుతున్నారు. ఏడాది కాలంగా భూకేటాయింపులు కూడా ఈ ముగ్గురు అధికారుల ఇష్టానుసారమే జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. బినామీల పేర్లతో భూములను కాజేశారన్న తీవ్రమైన ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి.