కందులకు క్వింటాల్ కు రూ.400 బోనస్ ఇవ్వాలి
వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కందులకు క్వింటాల్ కు రూ.400 బోనస్ ఇవ్వాలని, వెంటనే రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో రైతులు కంది పంట సాగు చేస్తున్నారని, 2.50 లక్షల టన్నుల కందుల దిగుబడి వచ్చే అవకాశముందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో, వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించినట్టుగా కందులకు మద్దతు ధరకు అదనంగా రూ.400 చొప్పున బోనస్ ఇవ్వాలని కోరారు. పంట దిగుబడి వస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, దీంతో రైతులు మద్దతు ధర కోల్పోయే ప్రమాదముందన్నారు. కందులకు క్వింటాల్ కు రూ.7,750 మద్దతు ధర ఉంటే మార్కెట్‌లో రూ.6,500 నుంచి రూ.6,800లకు మించి ధర పెట్టడం లేదని తెలిపారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి రైతుకు బోనస్ దక్కేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.