సాగులో ఉన్న భూములకే రైతు భరోసా
రిమోట్ సెన్సింగ్ డేటా సేకరణకు కంపెనీలతో మంత్రి తుమ్మల సమావేశం
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని.. ఇదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మరోసారి తేల్చిచెప్పారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో శనివారం సెక్రటేరియట్‌లో రిమోట్ సెన్సింగ్ డేటా సేకరణపై పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. సాగు చేసే భూములను ఏఈవోలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారని.. దానితో పాటు ఈ పథకంలో ఖచ్చితత్వం కోసం శాటిలైట్ డేటాను గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా సేకరిస్తామన్నారు. తద్వారా రైతుభరోసా పథకం అమలు చేయడంతో పాటు భవిష్యత్‌లో పంటల బీమా అమలు, విపత్తుల సమయంలో పంట నష్టాన్ని అంచనా వేయడం సులభమవుతుందన్నారు. సమావేశంలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధులు తాము గతంలో చేపట్టిన సర్వే వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి తదితరులు పాల్గొన్నారు.