అతడు పిచ్చివాడు కాదు.. మరి ఉగ్రవాదేనా ?
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ఇటీవల రాత్రివేళ చొరబడిన వ్యక్తిని గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. హఫీజుల్ ముల్లా అనే 31 ఏళ్ళ ఈ వ్యక్తి మొదట మెంటల్ అని పోలీసులు చెప్పినప్పటికీ.. దర్యాప్తులో ఇతగాడు మెంటల్ కాదని, పొరుగునున్న బంగ్లాదేశ్ తో ఇతనికి సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. మమత ఇంట్లో చొరబడడానికి కొన్ని రోజుల ముందు ఈ వ్యక్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏడు సార్లు రెక్కీ నిర్వహించాడట.. పైగా తన మొబైల్ లో మమత […]
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇంట్లో ఇటీవల రాత్రివేళ చొరబడిన వ్యక్తిని గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. హఫీజుల్ ముల్లా అనే 31 ఏళ్ళ ఈ వ్యక్తి మొదట మెంటల్ అని పోలీసులు చెప్పినప్పటికీ.. దర్యాప్తులో ఇతగాడు మెంటల్ కాదని, పొరుగునున్న బంగ్లాదేశ్ తో ఇతనికి సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. మమత ఇంట్లో చొరబడడానికి కొన్ని రోజుల ముందు ఈ వ్యక్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏడు సార్లు రెక్కీ నిర్వహించాడట.. పైగా తన మొబైల్ లో మమత ఇంటి ఫోటోలు తీసుకోవడమే గాక.. కాళీఘాట్ లోని ఆమె ఇంటికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు స్థానిక పిల్లలకు చాక్లెట్లు, టోఫీలు ఇచ్చి వారిని మచ్చిక చేసుకునేవాడని ‘సిట్’ అధికారి ఒకరు తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల మధ్య అర్ధరాత్రి హఫీజుల్ సెక్యూరిటీ దళాల కళ్ళు గప్పి.. మమత ఇంట్లో చొరబడ్డాడు. పైగా తన చొక్కాలో ఓ ఇనుప రాడ్ కూడా దాచుకున్నాడట .. తెల్లవారుజామున భద్రతా జవాన్లు వచ్చి చూసేంతవరకు ఆ ఇంట్లో దాక్కున్నాడు. సుమారు ఏడు గంటలపాటు ఓ గదిలో నక్కాడు. ఇతడి మొబైల్ ఫోన్లో మమత ఇంటి ఫోటోలు తాము చాలా చూశామని ఆ అధికారి చెప్పారు. ఇతడు కనీసం 11 సిమ్ కార్డులు వాడాడని, బంగ్లాదేశ్, ఝార్ఖండ్ తో బాటు బీహార్ రాష్ట్రానికి కూడా ఫోన్లు చేసినట్టు వెల్లడైందని ఆయన తెలిపారు. అయితే ఆ సంభాషణల సారాంశం ఇంకా తెలియలేదన్నారు.
గత ఏడాది జరిగిన దుర్గాపూజ సందర్భంగా హఫీజుల్.. బంగ్లా-బెంగాల్ సరిహద్దుల్లోని ఇచ్చమతి నదిలో బోటుద్వారా ప్రయాణించి కోల్ కతా నగరానికి చేరుకొన్నాడని, కొన్ని రోజులు నగరంలోనే మకాం పెట్టాడని తెలిసింది. బంగ్లాదేశ్ లో ఇతని కార్యకలాపాల గురించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. బహుశా ఇతనికి ఉగ్రవాద సంస్థలతో లింక్ ఉన్నట్టు అనుమానిస్తున్నామని, కానీ ఇది రూఢిగా తెలియవలసి ఉందని ‘సిట్’ అధికారి చెప్పారు. ఇతని పోలీసు కస్టడీని నగరంలోని కోర్టు ఈ నెల 18 వరకు పొడిగించింది.
అసలు దీదీ నివాసం వద్ద ఎప్పుడూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ వాళ్ళ కళ్ళు గప్పి ఇతగాడు మమత ఇంట్లోకి ఎలా ప్రవేశించాడన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. గత నాలుగు నెలల్లో పోలీసులు సేకరించిన పలు సీసీటీవీల ఇమేజీల్లో ముల్లా చాలాసార్లు కనబడినప్పటికీ ఎవరూ ఇతడిని అనుమానించలేదు. హస్నాబాద్ లో జరిగిన ఓ చోరీ కేసులో పట్టుబడినప్పటికీ ఆ గ్రామ కోర్టు క్షమించి ఇతడిని వదిలేసిందట ! ఇతనికి ఇన్ని సిమ్ కార్డులు ఎలా వచ్చాయి.. ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేస్తూ వచ్చాడు.. అసలు మమతా బెనర్జీ ఇంట్లో చొరబడడానికి గల కారణమేమిటి వంటి అనేక విషయాలపై పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు.