టిట్ ఫర్ టాట్.. తడాఖా చూపిన పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకే నుంచి తనను బహిష్కరించిన ఎడప్పాడి పళనిస్వామిపై రెబల్ నేత పన్నీర్ సెల్వం కూడా కసి తీర్చుకున్నారు. తనను కోటిన్నరమందికి పైగా పార్టీ కార్యకర్తలు కో-ఆర్డినేటర్ గా ఎన్నుకున్నారని, అలాంటిది పళనిస్వామికి గానీ, మరో నేత కె.పి. మునుస్వామికి గానీ తనను పార్టీనుంచి బహిష్కరించే హక్కు లేదని ఆయన అన్నారు. వారి ‘ఏకపక్ష నిర్ణయాన్ని’ ఆయన ఖండిస్తూ.. అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తానే వారిని బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తల మద్దతుతో నేను కోర్టుకెక్కుతాను.. న్యాయం […]
అన్నాడీఎంకే నుంచి తనను బహిష్కరించిన ఎడప్పాడి పళనిస్వామిపై రెబల్ నేత పన్నీర్ సెల్వం కూడా కసి తీర్చుకున్నారు. తనను కోటిన్నరమందికి పైగా పార్టీ కార్యకర్తలు కో-ఆర్డినేటర్ గా ఎన్నుకున్నారని, అలాంటిది పళనిస్వామికి గానీ, మరో నేత కె.పి. మునుస్వామికి గానీ తనను పార్టీనుంచి బహిష్కరించే హక్కు లేదని ఆయన అన్నారు.
వారి ‘ఏకపక్ష నిర్ణయాన్ని’ ఆయన ఖండిస్తూ.. అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తానే వారిని బహిష్కరిస్తున్నానని ప్రకటించారు. పార్టీ కార్యకర్తల మద్దతుతో నేను కోర్టుకెక్కుతాను.. న్యాయం కోరుతాను అని ఓపీఎస్ తెలిపారు.
అంతకుముందు చెన్నైలో పళనిస్వామి అధ్యక్షతన జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో పన్నీర్ సెల్వంను, ఆయన వర్గాన్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ మేరకు సీనియర్ నేత నాథం ఆర్. విశ్వనాథన్ ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.
సెల్వం పాలక డీఎంకే పట్ల, ఆ పార్టీ నాయకుల పట్ల మొగ్గు చూపుతున్నారని, అన్నాడీఎంకేను బలహీనపరచడానికి యత్నిస్తున్నారని ఈ తీర్మానంలో ఆరోపించారు. పన్నీర్ సెల్వం స్వార్థ ప్రయోజనాలకు పార్టీ గురికాకూడదని పేర్కొన్నారు.
పార్టీ కోశాధికారి పదవి నుంచి కూడా ఆయనను బహిష్కరించారు. ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు .. ఆర్.వైద్యలింగం, పి.హెచ్. మనోజ్, మాజీ ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ పై కూడా వేటు పడింది. అయితే పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇదంతా జరిగిందని పన్నీర్ సెల్వం ఆరోపించారు.
తాను ఊరుకోబోనని, తగిన సమయంలో కోర్టుకెక్కుతానని అన్నారు. అంతకుముందు హైడ్రామా జరిగింది. ఓపీఎస్, ఈపీఎస్ వర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో నగరంలోని ఏఐఏడీఎంకే ప్రధాన కార్యాలయాన్ని తమిళనాడు రెవెన్యూ శాఖ సీల్ చేసింది. (ఉదయం పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఈ కార్యాలయ తలుపులను పగులగొట్టారు).
పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పన్నీర్.. తన మద్దతుదారులతో ధర్నాకు దిగారు. పార్టీ కొత్త కోశాధికారిగా దిండిగల్ శ్రీనివాసన్ నియామకాన్ని వారు ఖండించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో పన్నీర్ కొనసాగారు. అయితే ఈ పోస్టు నుంచి, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తనను, తన వర్గాన్ని బహిష్కరిస్తున్నట్టు పళనిస్వామి శిబిరం ప్రకటించగానే పన్నీర్ సెల్వం ఆగ్రహంతో ఊగిపోయారు.
కాగా, రౌడీలతో పన్నీర్ వర్గం పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టిందని, ల్యాప్ టాప్ లను, కొన్ని డాక్యుమెంట్లను వారు ఎత్తుకుపోయారని పళనిస్వామి వర్గం ఆరోపిస్తోంది. ఇక పార్టీలో సింగిల్ లీడర్ షిప్ ఉండాలన్న ప్రతిపాదనను జనరల్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
అలాగే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని కౌన్సిల్ నియమించింది. పార్టీ కార్యకర్తల ఆశయాలను తీర్చేందుకు కృషిచేస్తానని, డీఎంకే ప్రభుత్వ అంతానికి ప్రయత్నిస్తానని పళనిస్వామి ప్రకటించారు. పార్టీ కార్యాలయాన్ని, దాని ఆస్తులను డ్యామేజీ చేసినందుకు పన్నీర్ సెల్వం పైన, ఆయన మద్దతుదారులపైనా పార్టీ తరఫున పళని క్యాంప్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.