మనదేశంలో మహిళా పోలీసుల సంఖ్య ఎంతంటే…

మనదేశంలో పోలీస్ శాఖలో ఉన్న మొత్తం సిబ్బందిలో మహిళల సంఖ్య 10.5 శాతం మాత్రమే. 2010 నుండి 2020 వరకు భారత పోలీస్ శాఖ సిబ్బంది 32శాతం పెరిగినప్పటికీ మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని లెక్కించగా మహిళా పోలీసులు 10.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. మహిళా పోలీసుల సంఖ్య 3.3 నుండి 10.5 శాతానికి పెరగడానికి 2006 నుండి 2015 వరకు కాలం పట్టింది. ప్రతి మూడు […]

Advertisement
Update:2022-07-09 05:28 IST

మనదేశంలో పోలీస్ శాఖలో ఉన్న మొత్తం సిబ్బందిలో మహిళల సంఖ్య 10.5 శాతం మాత్రమే. 2010 నుండి 2020 వరకు భారత పోలీస్ శాఖ సిబ్బంది 32శాతం పెరిగినప్పటికీ మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకుని లెక్కించగా మహిళా పోలీసులు 10.5 శాతం మంది మాత్రమే ఉన్నారు.

మహిళా పోలీసుల సంఖ్య 3.3 నుండి 10.5 శాతానికి పెరగడానికి 2006 నుండి 2015 వరకు కాలం పట్టింది. ప్రతి మూడు పోలీస్ స్టేషన్లలో ఒక్కదానికి మాత్రమే సిసిటివి కెమెరా సదుపాయం ఉంది. ఇండియా జస్టిస్ రిపోర్టు ఈ వివరాలను వెల్లడించింది. న్యాయవ్యవస్థలో సంస్కరణలకోసం పనిచేస్తున్న కొన్ని సంస్థలు సమిష్టిగా ప్రకటించిన ఈ నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు. 2019 నుండి ఏటా ఈ నివేదికని ప్రచురిస్తున్నారు.

ఈ ఏడాది వెల్లడైన ఇండియా జస్టిస్ రిపోర్టు వివరాల ప్రకారం 2021 జనవరి నాటికి దేశంలోని 41శాతం పోలీస్ స్టేషన్లలో మహిళల కోసం హెల్ప్ డెస్క్ లు లేవు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళల కోసం హెల్ప్ డెస్క్ లు ఉన్న ఏకైక రాష్ట్రం త్రిపుర కాగా, అరుణాచల ప్రదేశ్ లో ఒక్కటి కూడా లేదు. తొమ్మది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే 90శాతం పైగా పోలీస్ స్టేషన్లలో మహిళల కోసం హెల్ప్ డెస్క్ లు ఉన్నాయి.

ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు, పదకొండు రాష్ట్రాలు మహిళలకు పోలీస్ శాఖలో 33శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి కానీ 2020నాటికి ఒక్క రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం కూడా తన లక్ష్యాన్ని చేరలేదు. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీఘడ్ లో అత్యధికంగా 22.1 శాతం మహిళా పోలీసులు ఉండగా… తమిళనాడు, బీహార్, గుజరాత్ లలో వరుసగా 10.4, 17.4, 16శాతం మంది ఉన్నారు. ఈ రాష్ట్రాల లక్ష్యాలు 30, 38, 33 శాతాలుగా ఉన్నాయి. ఇక అత్యంత తక్కువ మహిళా పోలీసులు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మహిళా పోలీసుల సంఖ్య 6.6శాతంగా ఉంది. కాగా జార్ఖండ్, మధ్యప్రదేశ్ ల్లో కూడా అదే స్థాయిలో 6.6శాతం ఉన్నారు.

మహిళా పోలీస్ అధికారులూ తక్కువే…

మనదేశంలో మహిళా పోలీస్ అధికారుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ అధికారుల శాతం 8.2గా ఉంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సంఖ్య ఐదుశాతం కంటే తక్కువగా ఉంది. తమిళనాడు మిజోరాం లలో అత్యధికంగా 20.2శాతం మంది మహిళా పోలీస్ అధికారులు ఉండగా జమ్ము కాశ్మీర్లో అత్యంత తక్కువగా రెండుశాతం మంది మాత్రమే ఉన్నారు. డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ రిపోర్టు, 2021 ప్రకారం దేశంలోని 17,233 పోలీస్ స్టేషన్లలో 5,396 స్టేషన్లలో ఒక్క సిసిటివీ కెమెరా కూడా లేదు. కేవలం ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిలలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక్క సిసిటివీ కెమెరా అయినా ఉంది.

Tags:    
Advertisement

Similar News