రాహుల్‌ను ప్రధాని చేయాలనేది వైఎస్ కోరిక : రేవంత్ రెడ్డి
గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, రాహుల్‌ను ప్రధాని చేయాలనేది ఆయన చివరి కోరికని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కుల సంఘాల భవనాలకు స్థలాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వైఎస్ పేరుతో హైదరాబాద్‌లో స్మృతి వనం […]
గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, రాహుల్‌ను ప్రధాని చేయాలనేది ఆయన చివరి కోరికని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పంజగుట్టలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. కుల సంఘాల భవనాలకు స్థలాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వైఎస్ పేరుతో హైదరాబాద్‌లో స్మృతి వనం నిర్మించకపోవడం బాధాకరమన్నారు. ఇది వైఎస్‌ను అవమానించడమే అని రేవంత్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే వైఎస్ఆర్ స్మృతి వనం నిర్మించాలని రేవంత్ డిమాండ్ చేశారు. లేదంటే 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. అప్పుడు మేం వైఎస్ఆర్ స్మృతి వన్నాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొని రావడానికి వైఎస్ స్పూర్తితో పనిచేస్తామని రేవంత్ అన్నారు. ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల్లో ఆదరణను పొందారని రేవంత్ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన మహా నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తుచేశారు.
వైఎస్ లేని లోటు మనకు బాధాకరం : భట్టి విక్రమార్క
నిరంతర ప్రజల కోసమే పనిచేస్తూ.. సంక్షేమంతో పాటు దేశానికి అభివృద్ధిని చూపిన మహనీయుడు వైఎస్ఆర్ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని, ఇది చాలా బాధాకరమన్నారు.
ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు, పాలకుడు వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. ఆయన జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నామని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధి వైఎస్ఆర్ వల్లనే సాధ్యమయ్యాయని భట్టి స్పష్టంచేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. దేశంలోనే ఉచిత విద్యుత్‌కు ఆద్యుడు వైఎస్ అని గుర్తు చేశారు.
ఆయన చూపిన మార్గంలోనే ప్రతీ కార్యకర్త నడిచి రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని భట్టి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూల మాలలు వేసి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు.