డిజిటల్, సోషల్ మీడియా విచారణలు, తీర్పులు ఇబ్బందికరంగా మారాయి : సుప్రీంకోర్టు జడ్జి
డిజిటల్, సోషల్ మీడియాలు పరిధులు దాటి, వ్యక్తిగత ఎజెండాతో న్యాయ వ్యవస్థ, జడ్జిలపై దాడి చేస్తున్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా అన్నారు. మీడియా తమ సొంత దర్యాప్తు, విచారణ చేస్తూ ఏకంగా తీర్పులు కూడా ఇవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు మీడియాలను కంట్రోల్‌లో పెట్టడానికి కొత్త న్యాయ నిబంధనలు, వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు ఇటీవల […]
డిజిటల్, సోషల్ మీడియాలు పరిధులు దాటి, వ్యక్తిగత ఎజెండాతో న్యాయ వ్యవస్థ, జడ్జిలపై దాడి చేస్తున్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా అన్నారు. మీడియా తమ సొంత దర్యాప్తు, విచారణ చేస్తూ ఏకంగా తీర్పులు కూడా ఇవ్వడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు మీడియాలను కంట్రోల్‌లో పెట్టడానికి కొత్త న్యాయ నిబంధనలు, వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం చీవాట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ బెంచ్‌లో జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ పార్దీవాలా సభ్యుడిగా ఉన్నారు. నుపుర్ శర్మను మందలించిన తర్వాత మీడియాలో.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒక వర్గం జడ్జిలను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారం పోస్టులు పెట్టారు. నుపుర్‌ను ‘లూజ్ టంగ్’ అన్నందుకు సోషల్ మీడియాలో తమ వ్యాఖ్యలతో న్యాయమూర్తులను దాదాపు కొట్టినంత పనిచేశారు. నుపుర్ శర్మను ఆ ఇద్దరు జడ్జిలు ప్రమాదంలోకి నెట్టేశారంటూ కామెంట్లు చేశారు. దీనిపైనే పార్దీవాలా ఆదివారం స్పందించారు.
డిజిటల్, సోషల్ మీడియాను ఎక్కువగా హాఫ్ నాలెడ్జ్ జనాలు ఉపయోగిస్తున్నారు. ఏదో ఒక సంఘటనకు కదిలిపోయి, దానిపైనే విస్తృతంగా ఫోకస్ పెట్టి తమకు తామే తీర్పులు ఇచ్చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నదని మర్చిపోయి కేసుల తీర్పులను సోషల్ మీడియాలో రాస్తున్నారు. కోర్టులో మేం ఇచ్చే తీర్పులపై కూడా అటాక్ చేస్తున్నారంటూ జస్టిస్ పార్దివాలా వాపోయారు.
న్యాయ వ్యవస్థకు సంబంధం లేని విషయాలను కూడా లా, కాన్‌స్టిట్యూషన్‌తో ముడిపెట్టి ప్రజాభిప్రాయంగా మార్చేస్తున్నారు. ఇవన్నీ కచ్చితంగా సోషల్, డిజిటల్ మీడియాలు కావాలని చేస్తున్న ప్రచారమే అని ఆయన మండిపడ్డారు. ఏదో ఒక విధంగా ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడమే వీరి లక్ష్యం అని చెప్పారు. ఇటీవల అయోధ్యకు సంబంధించిన తీర్పు వెలువరిస్తే.. మాకేదో అయోధ్య మ్యాటర్‌లో చాలా ఆసక్తి ఉన్నట్లు జడ్జిలపై అనవసరమైన ఆరోపణలు చేశారు. సబ్‌జ్యుడీస్ విషయాలను కూడా రాజకీయం చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
విచారణ (ట్రయల్) అనేది కోర్టులు నిర్వహించాల్సిన బాధ్యత. కానీ ఈ రోజుల్లో సోషల్, డిజిటల్ మీడియా అనవసరంగా కోర్టు వ్యవహారాల్లో కలుగజేసుకుంటోంది. వాళ్లే ట్రయల్స్ నిర్వహిస్తూ తమ పరిధిలు దాటి వ్యవహరిస్తున్నారు. సగం నిజాలు తెలిసిన ఒక వర్గానికి చెందిన వ్యక్తులు జ్యుడీషియల్ ప్రాసెన్‌నే ప్రశ్నించేంతగా మారిపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు.
వీళ్లకు అసలు కోర్టులు, న్యాయ వ్యవస్థ ఎలా పని చేస్తాయి.. ఎలా తమ తీర్పులు ఇస్తాయి.. ఎలా తమ విచక్షణను ఉపయోగిస్తాయనే విషయాలు అసలు తెలియదని పార్దీవాలా చెప్పారు. ఇలాంటి వ్యక్తులే న్యాయ వ్యవస్థలకు అసలైన ప్రమాదకారులని ఆయన అన్నారు. కొందరి వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తూ.. జడ్జిలు ఇచ్చే తీర్పలు దానికి వ్యతిరేకంగా ఉంటే దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.