జాతీయ కార్యవర్గ సమావేశాలు.. ఆరు అంశాలపై బీజేపీ తీర్మానాలు
హైదరాబాద్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఇవాళ, రేపు నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే దేశంలో తిరుగు లేని, పటిష్టమైన పార్టీగా ఎదిగిన బీజేపీని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించడం, ప్రస్తుతం ఉన్న చోట అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో.. ఈ సమావేశాల్లో పూర్తిగా వాటిపైనే దృష్టిపెట్టనున్నది. గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం, మోడీ పాలనలో […]
హైదరాబాద్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఇవాళ, రేపు నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీకి కీలకం కాబోతున్నాయి. ఇప్పటికే దేశంలో తిరుగు లేని, పటిష్టమైన పార్టీగా ఎదిగిన బీజేపీని మరిన్ని రాష్ట్రాలకు విస్తరించడం, ప్రస్తుతం ఉన్న చోట అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. రాబోయే రెండు మూడేళ్లలో కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటంతో.. ఈ సమావేశాల్లో పూర్తిగా వాటిపైనే దృష్టిపెట్టనున్నది.
గత ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం, మోడీ పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేలా రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నది. ముఖ్యంగా గుజరాత్, కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో.. గెలుపుకై చేపట్టాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నది. అందుకే సమావేశాలను కూడా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు బహిరంగంగానే చెప్తున్నాయి. కేసీఆర్ పాలనలో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా (ఒక వేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లినా) ధీటుగా ఎదుర్కునేలా రాష్ట్ర క్యాడర్‌ను సంసిద్ధం చేయనున్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలాబలాలు, బలహీనతలు, లోటు పాట్ల వంటి అంశాలను సమీక్షించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు పరిశీలనకు వెళ్లారు. అక్కడకు వెళ్లిన నేతలంతా కార్యవర్గ సమావేశాల్లో తాము సేకరించిన సమాచారాన్ని అందించనున్నారు
ఆరు తీర్మానాలు..
బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఆరు తీర్మానాలను పార్టీ ప్రవేశపెట్టనున్నది. మోడీ ఎనిమిదేళ్ల పాలనను అభినందిస్తూ ఒక ధన్యవాద తీర్మానంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై తీర్మానం, పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై మరో తీర్మానం, పలు రాష్ట్రాల్లో పార్టీ కార్యాచరణ ప్రణాళికపై ఇంకో తీర్మానం, దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై తీర్మానంతో పాటు తెలంగాణలో పరిస్థితులు, కేసీఆర్ సర్కారు తీరుపై ఒక తీర్మానం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పాటు పార్టీ ముఖ్య నేతలు సూచించే మరి కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌కు సంబంధించిన ఎజెండాను మరి కాసేపట్లో ఖరారు చేయనున్నారు. మోడీ రాకముందే పార్టీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగనున్నది. జాతీయ ప్రధాన కార్యదర్శులు సమర్పించిన ఎజెండా ముసాయిదాపై ఇందులో చర్చ జరుగుతుంది. మార్పులు, చేర్పులు అవసరమైతే సిద్దం చేసి.. ఎజెండాను రూపొందించనున్నారు. దీన్ని నేషనల్ చీఫ్ జేపీ నడ్డా పరిశీలించి ఖరారు చేయనున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వేదికపై కేవలం ఇద్దరు మాత్రమే కూర్చుంటారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ మాత్రమే వేదికపై ఉంటారు. ప్రధాని మోడీ సహా మంత్రులు, సీఎంలు, ఇతర ముఖ్యనాయకులు వేదిక ఎదుట కిందే కూర్చుంటారు. అవసరమైన సమయంలో ప్రసంగించడానికి మాత్రమే వేదిక పైకి వస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 354 మంది నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, 118 మంది పదాధికారులు పాల్గొంటారు.