తండ్రి పేరు చెప్పుకోలేని బాబు.. మామకు మాత్రం..
తండ్రి పేరు చెప్పుకోలేని చంద్రబాబు.. మామకు మాత్రం జయంతులు, వర్ధంతులు, పెళ్లి రోజులు కూడా చేస్తారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక మాట అంటే సింపథీ కోసం చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారని, ఆయన తండ్రి ఖర్జూరపు నాయుడుని వెయ్యి మాటలన్నా, తిట్టినా ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. మామ ఎన్టీఆర్ కే కాదు అవకాశం వస్తే ఎవరికైనా […]
తండ్రి పేరు చెప్పుకోలేని చంద్రబాబు.. మామకు మాత్రం జయంతులు, వర్ధంతులు, పెళ్లి రోజులు కూడా చేస్తారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. గన్నవరం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
ఎన్టీఆర్ కుటుంబాన్ని ఒక మాట అంటే సింపథీ కోసం చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చారని, ఆయన తండ్రి ఖర్జూరపు నాయుడుని వెయ్యి మాటలన్నా, తిట్టినా ఏనాడూ పట్టించుకోలేదని చెప్పారు. మామ ఎన్టీఆర్ కే కాదు అవకాశం వస్తే ఎవరికైనా వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు కొడాలి నాని.
వంశీ లేకుండానే ప్లీనరీ..
గన్నవరం నియోజకవర్గంలో జరిగిన వైసీపీ ప్లీనరీకి స్థానిక ఎమ్మెల్యే వంశీ హాజరు కాలేదు. జిల్లా మంత్రి జోగి రమేష్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని హాజరయ్యారు.
పార్టీలో చేరాలంటే పదవికి, పాత పార్టీకి రాజీనామా చేయాలని గతంలో జగన్ కండిషన్ పెట్టడంతో వంశీతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు జగన్ కి మద్దతిచ్చారే కానీ, వైసీపీలో అధికారికంగా చేరలేదు. అందుకే వంశీ ప్లీనరీకి రాలేదని అంటున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో నాయకత్వ పోరు కూడా కారణం అని మరికొందరు చెబుతున్నారు. అయితే వంశీ అనారోగ్యం కారణంగా ప్లీనరీకి రాలేదని సమాచారం. ఇటీవల మొహాలీలో వంశీ అనారోగ్యానికి గురయ్యారు, అందుకే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్లీనరీకి రాలేదని తెలుస్తోంది.
2024లో వైసీపీ అభ్యర్థి వంశీయే..
వల్లభనేని వంశీ ప్లీనరీకి రాకపోయినా.. ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి కొడాలి నాని ఖరారు చేశారు. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వల్లభనేని వంశీయే పోటీ చేస్తారని స్పష్టం చేశారు కొడాలి నాని.
టీడీపీ తరపున పెనమలూరు టికెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడ వెళ్తారా అని చంద్రబాబు అడుగుతున్నారని, ఆ పార్టీ దుస్థితి అలా ఉందని చెప్పారు నాని. గన్నవరం, గుడివాడలో పోటీ చేసే సత్తా టీడీపీలో ఎవరికీ లేదన్నారు.