గ్లాసుకి ఓటేసినా కాపు నేస్తం గ్యారెంటీ – అంబటి..
ఏపీలో తర తమ భేదం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ఏ పార్టీ సానుభూతి పరులైనా.. అర్హులైతే చాలు పథకాల ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు. గ్లాసు గుర్తుకి ఓటేసినవారు కూడా కాపు నేస్తం అందుకుంటున్నారని, జగన్ పారదర్శక పాలనకు ఇది నిదర్శనం అని చెప్పారు అంబటి. గత ఎన్నికల్లో టీడీపీకి, జనసేనకు ఓట్లు వేసినవారి ఇళ్లకు వెళ్లి కూడా తమ పథకాలను వివరిస్తున్నామని, ప్రభుత్వ పథకాలతో వారికి చేకూరిన […]
ఏపీలో తర తమ భేదం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. ఏ పార్టీ సానుభూతి పరులైనా.. అర్హులైతే చాలు పథకాల ఫలాలు అందుతాయని హామీ ఇచ్చారు.
గ్లాసు గుర్తుకి ఓటేసినవారు కూడా కాపు నేస్తం అందుకుంటున్నారని, జగన్ పారదర్శక పాలనకు ఇది నిదర్శనం అని చెప్పారు అంబటి. గత ఎన్నికల్లో టీడీపీకి, జనసేనకు ఓట్లు వేసినవారి ఇళ్లకు వెళ్లి కూడా తమ పథకాలను వివరిస్తున్నామని, ప్రభుత్వ పథకాలతో వారికి చేకూరిన లబ్ధిని వివరిస్తున్నామని, ఈసారి వారంతా వైసీపీకే అండగా నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు.
కాపు ఓట్లే టార్గెట్..
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో భాగంగా.. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యంగా కాపు ఓటర్లను ఆకట్టుకునే విధంగా నేతలు ప్రసంగించారు.
గత ఎన్నికల్లో కొంతమంది కాపులు ఇతర పార్టీలకు మద్దతు తెలిపినా.. తాము మాత్రం అందరికీ న్యాయం చేశామని వివరించారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు మంత్రి అంబటి రాంబాబు. 2024లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంటుందని అన్నారాయన. వంగవీటి రాధా వచ్చినా, ఇంకెవరొచ్చినా.. ఇక్కడ వైసీపీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు.
పవన్ పై అంబటి ధ్వజం..
ఏపీలో చంద్రబాబుకి జై కొట్టేవారు ఇద్దరే ఇద్దరున్నారని, ఒకరు ఆయన సొంత పుత్రుడు లోకేష్ అయితే, మరొకరు దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు అంబటి. చంద్రబాబుకి పవన్ ఊడిగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. జగన్ ని సింగిల్ గా ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. భవిష్యత్తులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు సీఎం అయ్యే ఛాన్స్ లు లేవన్నారు. ఎవరెవరు కలసి వస్తారో రండి, అందర్నీ కట్టకట్టి కృష్ణా నదిలో కలిపేస్తామంటూ సెటైర్లు వేశారు అంబటి.