కర్నాటక కాంగ్రెస్ లో డైలమా: డికె వర్సెస్ సిద్ధూ!?
కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికలకు యేడాది ముందు నుంచే నాయకత్వం విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డి.కె.శివకుమార్, మాస్ లీడర్ గా పేరున్న మాజీ ముఖ్యమంత్రి, సిద్ధరామయ్యల మద్య పోటీ బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సమష్టి నాయకత్వంలోనే వెళుతుందని నాయకులు చెబుతున్నప్పటికీ , రంగంలోకి దిగేసరికి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని మరి కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. తను కూడా మాస్ లీడర్నేనని […]
కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికలకు యేడాది ముందు నుంచే నాయకత్వం విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన డి.కె.శివకుమార్, మాస్ లీడర్ గా పేరున్న మాజీ ముఖ్యమంత్రి, సిద్ధరామయ్యల మద్య పోటీ బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సమష్టి నాయకత్వంలోనే వెళుతుందని నాయకులు చెబుతున్నప్పటికీ , రంగంలోకి దిగేసరికి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని మరి కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.
తను కూడా మాస్ లీడర్నేనని నిరూపించేందుకు శివకుమార్ ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో తనకున్న మాస్ లీడర్ పేరును నిలుపుకుంటూ సీనియర్ నాయకుడు సిద్ధ రామయ్య కూడా నిర్దిష్ట సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని నడిపిస్తున్నారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవచ్చు. ఈ సందర్భంలో డికె శివకుమార్, సిద్ధరామయ్యల బలాబలాల పై అటు నాయకుల్లోనూ ప్రజల్లోనూ చర్చలు జరుగుతుతన్నాయి.
శివకుమార్‌కు వొక్కలిగ మద్దతు లభిస్తుందా?
2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కెపిసిసి) అధ్యక్షుడిగా డికె శివకుమార్ నియమితులయ్యారు. అప్పట్నుంచి ఆయన రాష్ట్రంలో కోవిడ్-19 నిర్వహణ, ధరల పెరుగుదల, పాఠ్యపుస్తకాల్లో మార్పులు, విద్వేష ప్రసంగాలు , నేరాలు వంటి సమస్యలపై పోరాడుతూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ప్రచారాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
డికె శివకుమార్ పార్టీ కార్యకర్త స్థాయి నుండి పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఎదుగుతూ వరుసగా ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికవుతూ పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఆయనకు గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వేధింపులకు గురిచేసినందుకు నిరసనగా ఆయన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా గత నెలలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో తో కలిసి ఢిల్లీలో నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ యేడాది జూన్ 18న పాఠ్యాంశాలను కాషాయీకరణ చేయడాన్ని నిరసిస్తూ లింగాయత్, వొక్కలిగ సామాజికవర్గాలకు సాధుసంతులు, మఠాధిపతులతో వేదికను పంచుకున్నారు. దీనిద్వారా కాంగ్రెస్ వొక్కలిగ ఓటు బ్యాంకును ఏకీకృతం చేసేందుకు బలమైన కాంగ్రెస్ నాయకుడిగా ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర జనాభాలో 11 శాతం ఉన్న వొక్కలిగ సామాజికవర్గం బలమైన ఓటు బ్యాంకు. హెచ్‌డి దేవెగౌడకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు డికె శివకుమార్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఆయన ప్రయత్నాలు నెరవేరకపోవచ్చని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ సభ్యుడు ఒకరు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆయన రాష్ట్రంలోని రైతులకు మద్దతుగా వారు నిర్వహిస్తున్న నిరసనలలో, అగ్నిపథ్ పథకం, పాఠ్యపుస్తకాల సవరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలోనూ పాల్గొన్నారు. మొన్న తుముకూరు లో జరిగిన నవ సంకల్ప శిబిర్ ప్రారంభోత్సవంలో శివకుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “కర్ణాటకలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని శాంపిల్ సర్వే అంచనా వేసింది” అని చెప్పారు.
పిసిసి అధ్యక్షులు సీఎం లు కాలేరా..?
కర్నాటకలో కాంగ్రెస్ కేపీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సందర్భాలు మూడు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా పార్టీ వ్యవహారాలకు సారథ్యం వహించే వ్యక్తికి ఈ పరిపాలనా అవకాశం ఇవ్వరు. కర్నాటకలో పరిస్థితులను బట్టి అక్కడ కాంగ్రెస్‌కు నమ్మకమైన ట్రబుల్ షూటర్ తోపాటు పరిపాలనా పరంగా మాస్ లీడర్ అవసరమని చెబుతుంటారు.
రాబోయే ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండా వెళ్ళాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మంచిదేనని, దీని వల్ల పార్టీలో ఐక్యత కొనసాగేందుకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో సిద్ధరామయ్య, డికె ఇద్దరూ రెండు స్తంభాలవంటి వారు. ఒకరు పార్టీ విధేయుడు, ట్రబుల్ షూటర్ కాగా, మరొకరు బలమైన పాలనా సామర్ధ్యంగల మాస్ లీడర్. ఇద్దరూ వేర్వేరు శిబిరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల ఏ ఒక్కరి పేరును ప్రకటించినా పార్టీ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి అన్నారు.
కాంగ్రెస్ స్ట్రాటజీ ఇదే..!
సిద్ధరామయ్యకు ప్రజలపై మంచి పట్టు ఉందని కర్ణాటక కాంగ్రెస్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే డీకే శివకుమార్ కేపీసీసీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల పార్టీకి కచ్చితంగా మేలు జరుగుతుందని కూడా అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ఎన్నడూ ప్రకటించలేదని అన్నారు. “డికె శివకుమార్ , సిద్ధరామయ్యల విభిన్నమైన రాజకీయాల దృష్ట్యా, పార్టీకి మార్గనిర్దేశం చేయడానికి ఒక నిర్దిష్ట నాయకుడిని కేంద్ర నాయకత్వం ఖచ్చితంగా ఎంపిక చేయలేకపోయింది.
అందువల్ల డికె విధేయత, దూకుడు తనాన్ని, సిద్ధరామయ్య మాస్ అప్పీల్ ను ఉపయోగించుకోవాలని పార్టీ కోరుకుంటోంది.” అన్నారాయన. ‘మాస్ అప్పీల్ కేవలం ఆయా వ్యక్తులు చేసే పని వల్లనే వస్తుంది తప్ప పదవులను బట్టి కాదు.. కచ్చితంగా డీకే. శివకుమార్ పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండటం ఆయనకు బాగా ఉపయోగపడుతుందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పటికే మాస్ లీడర్‌గా, మంచి అడ్మినిస్ట్రేటర్‌గా సిద్ధరామయ్య కూడా తన సత్తాను నిరూపించుకున్నారని ఆయన అన్నారు..ఎన్నికల తర్వాత డికె వర్సెస్ సిద్ధూ గా పరిస్థితులు మారే ప్రమాదం కూడా లేకపోలేదని కూడా అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.