దివ్యాంగ ఉద్యోగిపై వైసీపీ సర్పంచ్‌ భర్త అమానుష దాడి

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే అందరి సమక్షంలోనే దివ్యాంగుడైన డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి చేశాడు. కాలితో ఎగిరెగిరి తన్నాడు. అతి కష్టం మీద ఇతర ఉద్యోగులు సర్పంచ్‌ను బయటకు తీసుకెళ్లారు. అంతటితో ఆగలేదు. ఉద్యోగి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దారికాచి మరోసారి కొట్టాడు. ఈ రెండు ఘటనలను ఇతర ఉద్యోగులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో సర్పంచ్ భర్త దొరికిపోయాడు. నందిగాం మండలం కవిటి ఆగ్రహారం […]

Advertisement
Update:2022-06-26 04:06 IST

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో వైసీపీ సర్పంచ్ భర్త రెచ్చిపోయాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే అందరి సమక్షంలోనే దివ్యాంగుడైన డిజిటల్ అసిస్టెంట్‌పై దాడి చేశాడు. కాలితో ఎగిరెగిరి తన్నాడు. అతి కష్టం మీద ఇతర ఉద్యోగులు సర్పంచ్‌ను బయటకు తీసుకెళ్లారు. అంతటితో ఆగలేదు. ఉద్యోగి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో దారికాచి మరోసారి కొట్టాడు. ఈ రెండు ఘటనలను ఇతర ఉద్యోగులు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడంతో సర్పంచ్ భర్త దొరికిపోయాడు.

నందిగాం మండలం కవిటి ఆగ్రహారం గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్‌ భర్త గున్నయ్య.. సచివాలయానికి వచ్చి టీడీపీ వారికి పింఛ‌న్‌ ఎలా ఇచ్చారంటూ డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవరావుతో గొడవ పెట్టుకున్నారు. అర్హులందరికీ పింఛ‌న్లు ఇవ్వాలని ప్రభుత్వమే చెప్పిందని వాసుదేవరావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతలో గున్నయ్య తనకే ఎదురు చెబుతావా అంటూ చొక్కపట్టుకుని ఈడ్చేశాడు. అనంతరం కాలితో తన్నాడు.

దివ్యాంగుడైన వాసుదేవరావును హేళన చేశాడు. ఉన్న కాలు కూడా 'తీయించేస్తా కొడకా' అంటూ ఊగిపోయాడు. ఇతర ఉద్యోగులు సర్దిచెప్పడంతో వెళ్లిపోయిన గున్నయ్య.. తిరిగి సాయంత్రం దారి కాచాడు. వాసుదేవరావు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో రైల్వే గేట్‌ వద్ద దాడి చేశాడు. కాలితో తన్నడంతో దివ్యాంగుడైన ఉద్యోగి పక్కనే ఉన్న పొదల్లోకి పడిపోయాడు.

ఈ రెండు దాడుల దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ఉండడంతో వెంటనే గున్నయ్యను అరెస్టు చేయాలని మండల పరిధిలోని గ్రామ సచివాలయ ఉద్యోగులంతా ఏకమయ్యారు. దాడిని నిరసిస్తూ ఎంపీడీవో కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నాకు దిగారు. దాడి దృశ్యాలు ఉండడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇంకా గున్నయ్యను పోలీసులు అరెస్ట్ చేయలేదు.

Tags:    
Advertisement

Similar News