మహారాష్ట్ర సంక్షోభంలో అస్సోం సీఎం హిమంతా కీ రోల్ !
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అస్సోం సీఎం హిమంతా బిస్వా శర్మ కీ రోల్ పోషిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈశాన్యంలో ప్రభుత్వాలను పడగొట్టడంలో మంచి హస్తవాసి చూపుతున్నట్టు పేరు పొందిన ఈయన ఈ పరాయి రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వాన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు గౌహతి చేరుకోగానే శర్మ వారికి ‘ఆశ్రయం’ కల్పిస్తున్నారని ఓ వైపు అస్సోం 55 లక్షల మంది ప్రజలు […]
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అస్సోం సీఎం హిమంతా బిస్వా శర్మ కీ రోల్ పోషిస్తున్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈశాన్యంలో ప్రభుత్వాలను పడగొట్టడంలో మంచి హస్తవాసి చూపుతున్నట్టు పేరు పొందిన ఈయన ఈ పరాయి రాష్ట్ర అంతర్గత వ్యవహారాల్లో వేలు పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. శివసేన నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వాన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు గౌహతి చేరుకోగానే శర్మ వారికి ‘ఆశ్రయం’ కల్పిస్తున్నారని ఓ వైపు అస్సోం 55 లక్షల మంది ప్రజలు భారీ వరదలకు గురికాగా.. పట్టించుకోకుండా ఈయన వీరికి ఆతిథ్యమిచ్చే సిగ్గుచేటు పనులకు పూనుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
శర్మ మొదట తమ రాష్ట్ర పరిస్థితిపై దృష్టిపెట్టాలని, వరద బాధితులకు పునరావాసం, ఆహారం వంటి సౌకర్యాలను కల్పించేందుకు చొరవ తీసుకోవాలని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా డిమాండ్ చేశారు. మంచి ‘హ్యాపీ’గా ఉన్నప్పుడు ఆయన రాజకీయాలాట ఆడుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాగే అస్సోం జాతీయ పరిషత్ కూడా శర్మపై విరుచుకుపడింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఆయన ఆతిథ్యం ఇస్తున్నట్టు కనబడుతోందని, మహారాష్ట్రలోని అసంతృప్తివాదులకు ఈ రాష్ట్రం కేంద్రబిందువుగా మారడం విచారకరమని ఈ సంస్థ ప్రెసిడెంట్ ఎల్.గొగోయ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది వరదలతో అల్లలాడుతున్నారు. కానీ దీన్ని విస్మరించి ఈ బీజేపీ ప్రభుత్వం శివసేనను చీల్చడంలో బిజీగా ఉంటోంది.. అస్సాం ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామన్న అంశాన్ని బీజేపీ విస్మరించరాదు.. కానీ మరాఠీ రీజనలిజాన్ని నాశనం చేసేందుకు జరుగుతున్న యత్నాలకు దీటైన జవాబివ్వాలి అని ఆయన కోరారు. అలాగే అస్సాం వరద బాధితులను ఆదుకోవడం పై ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇక్కడి పరిస్థితిని అంచనా వేయడానికైనా వారికి తీరిక లేకపోయిందని ఆయన ఆరోపించారు.
శర్మ అత్యుత్సాహం
మహారాష్ట్ర నుంచి శివసేన ఎమ్మెల్యేలను గౌహతిలోని లగ్జరీ హోటల్ కి తరలించడంలోనూ, వారి బాగోగుల పర్యవేక్షణలోనూ అస్సోం సీఎం హిమంత బిస్వ శర్మ చూపుతున్న అత్యుత్సాహం విపక్షాలకు కంపరం కలిగిస్తోంది. ఏక్ నాథ్ షిండే, ఆయన 40 మంది ఎమ్మెల్యేల వర్గం సూరత్ నుంచి మంగళవారం రాత్రి విమానంలో గౌహతి చేరుకున్నారు. అప్పటి నుంచి శర్మ ఇక ఇదేపనిలో ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే కాక.. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీకి లబ్ది చేకూర్చే బాధ్యతలను ఈ పార్టీ ఈయనకు ఇచ్చినట్టు కనిపిస్తోంది.
మణిపూర్ లో బీజేపీ ఆధ్వర్యాన సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడేలా చేయడంలో శర్మ కీలకపాత్ర వహించారు. లోగడ 60 మంది సభ్యులున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 28 సీట్లు, బీజేపీకి 21 సీట్లు వచ్చినప్పటికీ మొత్తానికి బీజేపీకి అనుకూలంగా పావులు కదిపి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా చూశారు. అలాగే 2016 లో అరుణాచల్ ప్రదేశ్ లో పాలక పీపుల్స్ పార్టీనుంచి చాలామంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి ఫిరాయించేలా చూశారు. దీంతో పేమా ఖండు ప్రభుత్వం ఏర్పడింది. రెండేళ్ల తరువాత మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ ఆధ్వర్యాన ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామి అయ్యేందుకు ఈ పార్టీకి సహాయపడ్డారు. ఇలా హిమంతా బిస్వా శర్మ బీజేపీకి తలలో నాలుకలా మారారు.