‘మహా’ సంక్షోభం: నాకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతుంది : ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తోంది. ఈ పరిణామాల వెనక బీజేపీ పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే వదులుకునేది లేదంటూ బీజేపీ చెప్పడాన్ని బట్టి ఈ విషయం తేటతెల్లం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి సన్నిహితుడిగా పేరున్న ఏక్‌నాథ్ షిండే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు వెళ్లిపోయారు. అక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాటిల్ తో మంతనాలు జరిపాడు. ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడేందుకు ఉద్ధవ్ థాక్రే తో పాటు మధ్యవర్తి మిలింద్‌నర్వేకర్ […]
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం పతనం దిశగా పయనిస్తోంది. ఈ పరిణామాల వెనక బీజేపీ పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే వదులుకునేది లేదంటూ బీజేపీ చెప్పడాన్ని బట్టి ఈ విషయం తేటతెల్లం అవుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి సన్నిహితుడిగా పేరున్న ఏక్‌నాథ్ షిండే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్‌కు వెళ్లిపోయారు. అక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాటిల్ తో మంతనాలు జరిపాడు. ఏక్‌నాథ్ షిండేతో మాట్లాడేందుకు ఉద్ధవ్ థాక్రే తో పాటు మధ్యవర్తి మిలింద్‌నర్వేకర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
బుధవారం తెల్లవారుజామున షిండే బృందం గుజరాత్ నుంచి మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సోంకు చేరుకుంది. ఈ ఉదయం గౌహతికి చేరుకున్న రెబల్ శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే, తనకు 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. తన పార్టీకి చెందిన 40 మందితో పాటు 6 మంది ఇండిపెండెట్ల మద్దతు కూడా ఉందని పేర్కొన్నారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. తాను శివసేన నుంచి విడిపోవడం లేదని, బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. ‘మేము బాలాసాహెబ్ థాక్రే స్థాపించిన శివసేనను విడిచిపెట్టలేదు. ఇక ముందు కూడా విడిచిపెట్టం. మేము హిందుత్వాన్ని విశ్వసిస్తాం’’ అని షిండే అన్నారు.
అస్సోంలో బీజేపీ నేతల స్వాగతం!
గౌహతి విమానాశ్రయంలో షిండే బృందానికి బీజేపీ నేతలు పల్లబ్ లోచన్ దాస్, సుశాంత బోర్గోహైన్ షిండేలు స్వాగతం పలికారు. వారి కోసం సిద్ధం చేసిన ఫైవ్ స్టార్ హోటల్‌లో అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భేటీ అయ్యారు. ఏక్‌నాథ్ షిండే రాష్ట్రంలో బీజేపీతో సఖ్యతను పునరుద్ధరించుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నారు.
షిండే చర్యలను గమనించిన బీజేపీ ఆలస్యం లేకుండా రంగంలోకి దిగి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపింది. ఈ సందర్భంలోనే తాము ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనుకోవడం లేదు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది.
తాజా పరిణామాలతో శివసేన అప్రమత్తమైంది. మిగిలిన తన ఎమ్మెల్యేలను ముంబైలోని వివిధ హోటళ్లలో ఉంచింది. షిండేను మంగళవారం మధ్యాహ్నం పార్టీ చీఫ్ విప్‌గా తొలగించిన విషయం తెలిసిందే. వెంటనే ఆయన తన ట్విట్టర్ బయో నుంచి శివసేనను తొలగించాడు.
అంతకు ముందు షిండే తాను “బాలాసాహెబ్ థాక్రేకు చెందిన శివసైనిక్” అని, అధికారం కోసం ఎన్నటికీ మోసం చేయనని ట్వీట్ చేశారు. “బాలాసాహెబ్ మాకు హిందుత్వాన్ని నేర్పించారు. బాలాసాహెబ్ ఆలోచనలు, ధర్మవీర్ ఆనంద్ దిఘే సాహెబ్ బోధనలే మాకు ఆదర్శం. అధికారం కోసం మేము ఎన్నడూ మోసం చేయలేదు” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఏక్‌నాథ్ షిండే నుంచి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన వస్తే తమ పార్టీ 'కచ్చితంగా పరిశీలిస్తుందని' మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చెప్పారు. ఈరోజు ఏక్‌నాథ్ షిండే గవర్నర్ ను కలిసే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర గవర్నర్‌కు కరోనా సోకినట్టుగా గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర ట్విట్టర్ హ్యాండిల్ నుంచి స్పష్టం చేశారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా నన్ను ఆసుపత్రిలో చేర్చారు“ అని ట్వీట్ చేశారు.