గౌహతిలో ఏక్‌నాథ్ షిండే ! ‘ముప్పు’ పై మంత్రులతో చర్చించనున్న ఉద్ధవ్ థాక్రే
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తనకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకున్న తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే.. సూరత్ లోని హోటల్ నుంచి రాత్రి అసోం రాజధాని గౌహతి చేరుకున్నారు. ఈ నగర విమానాశ్రయంలో మొదటిసారిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ భవిష్యత్ కార్యాచరణపై నేడు చర్చించుకోనున్నామని తెలిపారు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో తమ వర్గీయులంతా సమావేశమవుతున్నారని ఆయన చెప్పారు. 33 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, […]
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. తనకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పుకున్న తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే.. సూరత్ లోని హోటల్ నుంచి రాత్రి అసోం రాజధాని గౌహతి చేరుకున్నారు. ఈ నగర విమానాశ్రయంలో మొదటిసారిగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ భవిష్యత్ కార్యాచరణపై నేడు చర్చించుకోనున్నామని తెలిపారు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ లో తమ వర్గీయులంతా సమావేశమవుతున్నారని ఆయన చెప్పారు.
33 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర శాసన సభ్యులు బుధవారం ఉదయం గౌహతి చేరుకొని ఈ హోటల్ లో అడుగుపెట్టారు. శివసేనకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా షిండే శిబిరంలో చేరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ కూటమి పనిచేస్తున్న తీరు పట్ల షిండే అనేక సందర్భాల్లో బాహాటంగానే తన అసంతృప్తిని బయటపెడుతూ వచ్చారు. థానేతో పాటు పలు జిల్లాల్లో మంచి పట్టున్న షిండే.. ఒకప్పుడు ఆటోడ్రైవర్ అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ శివసేన పరమ వీరాభిమాని అయిన ఈయన సత్తాగల సేన కార్యకర్తగా మారి.. క్రమంగా రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు.
తాజాగా ఈ నెలలో జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సేన ఓటమి షిండేకి మంచి అవకాశాన్ని ఇచ్చినట్లయింది. రాజ్యసభ ఎన్నికల్లో ఇతర పార్టీలు, స్వతంత్ర సభ్యులు బీజేపీకి మద్దతునిచ్చారని, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కూడా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందన్న విషయం నిర్ధారణ అయిందని, అందువల్లే తిరుగుబాటు చేయవలసి వచ్చిందని షిండే సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. పైగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను, 2014 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీతో సఖ్యత విషయాన్నీ పార్టీ సమీక్షించుకోవాలని ఆయన కొన్ని వారాల క్రితం సూచించారట. హిందుత్వ నినాదాన్ని పదేపదే ప్రస్తావిస్తున్న ఈయన.. శివసేనకు కీలక ఓటు బ్యాంకు వర్గాలు హిందువులేనని, కానీ కాంగ్రెస్, ఎన్సీపీలతో సేన అంటకాగడం వల్ల మహారాష్ట్ర ఓటర్లకు దూరమయ్యామని భావిస్తూవచ్చారని తెలుస్తోంది.
సేనకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో చేతులు కలిపే అంశాన్ని సేన సమీక్షించుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో థానే లోని ఓవలా మజ్జివాడ నియోజకవర్గ సేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్ నాయక్ బాహాటంగానే ఈ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే బీజేపీతో స్నేహమే బెటర్ అంటూ ఈయన సీఎం థాక్రేకి లోగడ లేఖ రాశారు.
గవర్నర్ ని కలుసుకోదల్చిన షిండే
మహారాష్ట్రలో రెబల్ నేత ఏక్ నాథ్ షిండే బుధవారం గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలుసుకోవాలనుకున్నారు. అయితే ఆయన కోవిడ్ పాజిటివ్ కి గురై ఆసుపత్రిలో చేరడంతో షిండే తన యోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు షిండే ‘డేంజర్’ ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే నేటి మధ్యాహ్నం కేబినెట్ సహచరులతో చర్చించనున్నారు.
ఇక ఇదంతా శివసేన అంతర్గత వ్యవహారమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొట్టి పారేయడం విశేషం. మూడు పార్టీల సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగాలనే తాను కోరుతున్నానని,చెప్పిన ఆయన.. విపక్ష బీజేపీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ తన వంతుగా అత్యవసర సమావేశాలు ప్రారంభించింది. ఏఐసీసీ పరిశీలకునిగా కమల్ నాథ్ ముంబై చేరుకోగా రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న సీఎల్ఫీ నేత బాలాసాహెబ్ నివాసంలో భేటీ అయ్యారు.