తృణమూల్ కాంగ్రెస్ కి యశ్వంత్ సిన్హా రాజీనామా .. ‘రేసు’లో ఉంటారా ?

రాష్ట్రపతి ఎన్నికకు తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయమై విపక్షాల్లో మళ్ళీ తపన మొదలైంది. మొదట శరద్ పవార్, తరువాత ఫరూక్ అబ్దుల్లా, తాజాగా గోపాలకృష్ణ గాంధీ ఈ రేసులో తాము ఉండబోమంటూ ప్రకటనలు చేసిన వేళ.. తిరిగి విపక్షాలు మంగళవారం సమావేశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం, ప్రతిపక్షాల మధ్య మరింత సమైక్యత కోసం కృషి చేయవలసి ఉన్నందున తాను పార్టీ […]

Advertisement
Update:2022-06-21 07:42 IST

రాష్ట్రపతి ఎన్నికకు తమ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న విషయమై విపక్షాల్లో మళ్ళీ తపన మొదలైంది. మొదట శరద్ పవార్, తరువాత ఫరూక్ అబ్దుల్లా, తాజాగా గోపాలకృష్ణ గాంధీ ఈ రేసులో తాము ఉండబోమంటూ ప్రకటనలు చేసిన వేళ.. తిరిగి విపక్షాలు మంగళవారం సమావేశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం, ప్రతిపక్షాల మధ్య మరింత సమైక్యత కోసం కృషి చేయవలసి ఉన్నందున తాను పార్టీ నుంచి వైదొలగాలనుకుంటున్నట్టు ఈ లేఖలో తెలిపారు.

రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాలు బహుశా సిన్హాను ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ఊహాగానాలు రేకెత్తిన తరుణంలో ఆయన ఈ చర్య తీసుకున్నారు. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో పవార్, ఫరూక్ అబ్దుల్లా, ఆ తరువాత గోపాలకృష్ణ గాంధీ పేర్లు ప్రస్తావనకు వచ్చినా.. యశ్వంత్ సిన్హా గురించి అంతగా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనబడలేదు. మాజీ కేంద్రమంత్రిగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. టీఎంసీలో తనకు మమతా,బెనర్జీ ఇచ్చిన గౌరవం, తన పట్ల చూపిన విశ్వాసానికి తానెంతో కృతజ్ఞుడినని, కానీ పార్టీని మించి విస్తృత జాతీయ ప్రయోజనాలకోసం, విపక్షాల మధ్య మరింత గట్టి సమైక్యత కోసం పని చేయవలసి ఉన్నందున తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని యశ్వంత్ సిన్హా వివరించారు. తన రాజీనామాను మమత అంగీకరించగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

నిజానికి రాష్ట్రపతి ఎన్నిక రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా సిన్హా పేరును కొన్ని పార్టీలు సూచించాయని తృణమూల్ కి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. ముగ్గురు, నలుగురు ఈ ప్రతిపాదనను సమర్థించారని కూడా ఆయన చెప్పారు. అలాగే తమ నేత మమత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఏమైనా.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఆయన అభ్యర్థిత్వం గురించి చర్చించవచ్చని తెలుస్తోంది. రేసులో ఆయన ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు.

సుమారు దశాబ్ద కాలంపాటు బీజేపీలో కొనసాగిన యశ్వంత్ సిన్హా.. 2018 లో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపిస్తూ ఆయన ఆ నాడు బీజేపీ నుంచి వైదొలగి టీఎంసీలో చేరారు. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ప్రతిపక్షాలు మళ్ళీ సమావేశమై.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై చర్చించనున్నాయి.

Tags:    
Advertisement

Similar News