సంక్షోభం దిశగా `మహా` సర్కార్‌.. శివసేనలో చీలిక

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. శివసేనలో చీలిక ఏర్పడింది. ఉద్దవ్‌ థాక్రే తీరుపై అసంతృప్తితో ఉన్న 12 మంది శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్ వెళ్లారు. సూరత్‌లోని ఒక హోటల్‌లో వారంతా తిష్టవేశారు. వీరిలో సీనియర్ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా ఉన్నారు. వీరంతా బీజేపీతో కలిసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాటిల్‌తో 12 మంది మంతనాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కొంతకాలంగా […]

Advertisement
Update:2022-06-21 06:01 IST

మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి భారీ షాక్‌ తగిలింది. శివసేనలో చీలిక ఏర్పడింది. ఉద్దవ్‌ థాక్రే తీరుపై అసంతృప్తితో ఉన్న 12 మంది శివసేన ఎమ్మెల్యేలు గుజరాత్ వెళ్లారు. సూరత్‌లోని ఒక హోటల్‌లో వారంతా తిష్టవేశారు. వీరిలో సీనియర్ మంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా ఉన్నారు.

వీరంతా బీజేపీతో కలిసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు పాటిల్‌తో 12 మంది మంతనాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కొంతకాలంగా థాక్రే తీరుపై ఏకనాథ్ షిండ్ అసంతృప్తిగా ఉన్నారు. దాన్ని పసిగట్టిన బీజేపీ ఆయనకు గాలం వేసినట్టు చెబుతున్నారు. శివసేన నిర్మాణంపై ఏక్‌నాథ్‌ షిండేకు మంచి పట్టుంది. ఆయన్ను శివసేనలో ఒక మాస్ లీడర్‌గా చూస్తారు.

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత శివసేనలో చీలిక మరింత స్పష్టంగా ఏర్పడింది. పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి క్రాస్‌ ఓట్ చేశారు. దాంతో సంఖ్యాబలం ఆధారంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ.. బీజేపీ ఐదు ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకుంది. శివసేన, ఎన్సీపీలు చెరో రెండు స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానాన్ని సొంతం చేసుకోగలిగింది.

బీజేపీ సొంత బలం 106 కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు 133 ఓట్లు పడ్డాయని మహారాష్ట్ర బీజేపీ నాయకులు ప్రకటించారు. ఇండిపెండెంట్లతో పాటు దాదాపు 20 మంది అధికార కూటమి ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటు వేసినట్టు అంచనా వేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సోమవారం సాయంత్రం నుంచే మంత్రితో సహా 12 మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రత్యేక విమానంలో రాత్రే వీరంతా గుజరాత్‌ వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

తమ పార్టీ ఎమ్మెల్యేలు గ్రూప్‌ కట్టడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి థాక్రే మధ్నాహ్నం పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం మంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా మీడియా ముందుకు వచ్చి తమ వాదన వినిపించే అవకాశం ఉంది. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి రాకుంటే అఘాడీ సర్కార్‌ పతనం వైపు పయణించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News