‘గేమ్ ఛేంజర్’ ఏక్ నాథ్ షిండే ! మహారాష్ట్ర పాలిటిక్స్ లో మహా ‘డేంజర్’

రాత్రికి రాత్రే మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న మంత్రి ఏక్ నాథ్ షిండే అలాంటోడు..ఇలాంటోడు కాదు. 13 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలను గుజరాత్ లోని సూరత్ హోటల్ కి హుటాహుటిన తరలించాడంటే ఈ శివసేన నేత గేమ్ ఛేంజర్ కాక మరేమిటని అంటున్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వ పునాదులను కదిలిస్తున్న ఈ షిండే థానేలో గొప్ప నేత. థానేతో బాటు అనేకచోట్ల పార్టీ పటిష్టతకు షిండే చేసిన కృషి అపారమంటారు. ఇటీవల మరో మంత్రి ఆదిత్యథాక్రే […]

Advertisement
Update:2022-06-21 08:01 IST

రాత్రికి రాత్రే మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్న మంత్రి ఏక్ నాథ్ షిండే అలాంటోడు..ఇలాంటోడు కాదు. 13 మందికి పైగా పార్టీ ఎమ్మెల్యేలను గుజరాత్ లోని సూరత్ హోటల్ కి హుటాహుటిన తరలించాడంటే ఈ శివసేన నేత గేమ్ ఛేంజర్ కాక మరేమిటని అంటున్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వ పునాదులను కదిలిస్తున్న ఈ షిండే థానేలో గొప్ప నేత. థానేతో బాటు అనేకచోట్ల పార్టీ పటిష్టతకు షిండే చేసిన కృషి అపారమంటారు. ఇటీవల మరో మంత్రి ఆదిత్యథాక్రే అయోధ్యను విజిట్ చేసినప్పుడు ఈయన కూడా ఆయన వెంటే ఉన్నారు.

మహారాష్ట్ర శాసన సభకు షిండే వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 2004, 2009, 2014, 2019 సంవత్సరాల్లో తనదే గెలుపు అని నిరూపించుకున్నారు. 2014 లో విజయం అనంతరం శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా, ఆ తరువాత అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో శివసేన తలపెట్టిన బడా కార్యక్రమాలన్నింటిలోనూ ఏక్ నాథ్ షిండే తలమానికంగా ఉంటూ వచ్చారు.

కొంతకాలంగా తనను పార్టీ పక్కన పెట్టిందని కాస్త అప్ సెట్ అయిన ఈయనకు ఇంచుమించు అన్ని పార్టీలతోనూ సఖ్యత ఉంది. పలువురు శివ‌సేన ఎమ్మెల్యేలకు షిండే దాదాపు ఆపద్బాంధవుడు. తన కొడుకు శ్రీకాంత్ షిండే లోక్ సభ ఎంపీ కాగా సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు. ఏమైనా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి ఏక్ నాథ్ షిండే మూలకారకుడయ్యారు. సీఎం ఉద్ధవ్ థాక్రే కంట్లో నలుసులా మారారు. లోగడ మహావికాస్ అఘాడే ప్రభుత్వం ఏర్పడినప్పుడు షిండేని పట్టణాభివృద్ధి, ప్రజా పనుల శాఖ మంత్రిగా తీసుకున్నారు. కానీ రానురానూ శివసేన నాయకత్వం తనను చిన్నచూపు చూస్తోందని భావించిన ఈయన ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొడతారా అనే స్థాయికి రాజకీయాలను తీసుకువెళ్లారు. సూరత్ లోని రిసార్ట్ లో షిండే నేతృత్వాన 13 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం.

ఇక షిండే పుణ్యమా అని రాష్ట్రంలో బీజేపీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ పార్టీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ త్వరలో హోమ్ మంత్రి అమిత్ షాను, పార్టీ అధ్యక్షుడు నడ్డాను కలుసుకోనున్నారు. అమిత్ షా అయితే అప్పుడే నడ్డా నివాసానికి చేరుకున్నారు. అవసరమైతే రాష్ట్రంలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. శివసేనలో తలెత్తిన లుకలుకలు తమ పార్టీకి లాభిస్తాయని ఆయన అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News