ముదురుతున్న ఆహార సంక్షోభం.. గిరి గీసుకుంటున్న ప్రపంచ దేశాలు

ఇండోనేసియా నుంచి పామాయిల్‌ ఎగుమతులు ఆగిపోయాయి. భారత్ గోధుమల విషయంలో ఎగుమతులు తగ్గించేసింది. సెర్బియా, కజకిస్థాన్ దేశాలు ధాన్యం ఎగుమతులపై నిషేధం విధించాయి. ఇక ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా నూనె ఎగుమతులు ఆగిపోయాయి. అమెరికాలో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గోధుమల దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఇలా అన్ని కారణాలు ఇప్పుడు ఆహార సంక్షోభానికి పరోక్ష కారణాలవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నిటినీ అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నాయి. పెరుగుతున్న ధరలు.. తగ్గుతున్న నిల్వలు.. ఆహార పదార్థాల నిల్వలు తగ్గిపోవడం, సరఫరా, […]

Advertisement
Update:2022-06-20 02:54 IST

ఇండోనేసియా నుంచి పామాయిల్‌ ఎగుమతులు ఆగిపోయాయి. భారత్ గోధుమల విషయంలో ఎగుమతులు తగ్గించేసింది. సెర్బియా, కజకిస్థాన్ దేశాలు ధాన్యం ఎగుమతులపై నిషేధం విధించాయి. ఇక ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా నూనె ఎగుమతులు ఆగిపోయాయి. అమెరికాలో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో గోధుమల దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఇలా అన్ని కారణాలు ఇప్పుడు ఆహార సంక్షోభానికి పరోక్ష కారణాలవుతున్నాయి. ప్రపంచ దేశాలన్నిటినీ అభద్రతా భావంలోకి నెట్టేస్తున్నాయి.

పెరుగుతున్న ధరలు.. తగ్గుతున్న నిల్వలు..
ఆహార పదార్థాల నిల్వలు తగ్గిపోవడం, సరఫరా, రవాణా సరిగా లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంట నూనెలు, ధాన్యం, మాంసం, పాల ఉత్పత్తుల ధరలు గరిష్టాలకు చేరుకున్నాయని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) పేర్కొంది. గత మార్చిలో అత్యథికంగా 13 శాతం ధరలు పెరిగాయని, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం తర్వాత ఇది అత్యథిక పెరుగుదల అని చెబుతున్నారు నిపుణులు. 2008-11 మధ్యలో ప్రపంచం దేశాలు ఆహార సంక్షోభంతో అల్లాడిపోయాయి. మరోసారి అలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

గిరిగీసుకుంటున్న దేశాలు..
ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే వచ్చే లాభం కంటే.. స్వదేశంలోనే వాటిని నిల్వ చేస్తే భవిష్యత్ అవసరాలకు భరోసా ఉంటుందని భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. అందుకే భారత్ లో గోధుమల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. సెర్బియా, కజకిస్థాన్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాయి. ఇండోనేసియా పామాయిల్ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా లాభాలను ఆర్జిస్తున్నా.. ఇప్పుడు దేశీయ అవసరాలకోసం ఎగుమతులను తగ్గించేసింది. దాదాపుగా ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న అన్ని దేశాలు.. తమ దేశ పరిస్థితిని అంచనా వేసి ఎగుమతులు తగ్గించేసుకుంటున్నాయి. ఫలితంగా ఆయా ఉత్పత్తుల లభ్యత ఇతర దేశాల్లో తగ్గిపోతోంది, రేట్లు మరింతగా పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల భారాన్ని మోయలేక ఇప్పటికే శ్రీలంక నుంచి పెరూ వరకు 20కి పైగా దేశాలు సతమతమవుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరల భారీగా పెరగడంతో టర్కీలో ద్రవ్యోల్బణం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత గరిష్టానికి చేరుకుంది.

ఆహార అభద్రతా సూచీ..
ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోయి, ఉత్పత్తి పెరిగే వరకు ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంటుందని వ్యాపార వర్గాలంటున్నాయి. గత ఏడాది కాలంలో ప్రపంచ ఆహార అభద్రతా సూచీ 25 శాతం పెరిగింది. ఈ ఏడాదిలో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమని గ్లోబల్‌ నెట్‌ వర్క్‌ అగైనెస్ట్ ఫుడ్‌ క్రైసిస్‌ (GNAFC) స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News