అమిత్ షాతో ఈట‌ల భేటీ.. బండికి, ఈటలకు మధ్య విబేధాలు మరింత పెరిగేనా ?

బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఆక‌స్మిక ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఒక వైపు సికిందరాబాద్ లో అగ్నిప‌థ్ ఆందోళ‌న‌ల నేపథ్యంలో ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌లు, మరో వైపు వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్ బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో రాజేంద‌ర్ కు ఢిల్లీ నుండి  పిలుపు రావ‌డం, ఆయ‌న హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏమై ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ‌లో ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బిజెపి..సీనియ‌ర్ నాయ‌కుడైన […]

Advertisement
Update:2022-06-20 05:46 IST

బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ఆక‌స్మిక ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. ఒక వైపు సికిందరాబాద్ లో అగ్నిప‌థ్ ఆందోళ‌న‌ల నేపథ్యంలో ఆరోప‌ణ‌లు, ప్రత్యారోప‌ణ‌లు, మరో వైపు వ‌చ్చే నెల‌లో హైద‌రాబాద్ బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో రాజేంద‌ర్ కు ఢిల్లీ నుండి పిలుపు రావ‌డం, ఆయ‌న హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావ‌డం వెన‌క ఆంత‌ర్యం ఏమై ఉంటుంద‌నే చ‌ర్చ సాగుతోంది.

తెలంగాణ‌లో ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బిజెపి..సీనియ‌ర్ నాయ‌కుడైన ఈట‌ల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్పేందుకే అమిత్ షా తో చ‌ర్చ‌ల‌కు ఆహ్వానం అందింద‌ని భావిస్తున్నారు. ఆయ‌న‌కు రానున్న ఎన్నిక‌ల దృష్ట్యా కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కాషాయ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ల్లె ప్రాంతాల్లో పార్టీని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు చేర్చి మ‌రింత ప‌టిష్టం చేసి ఎన్నిక‌ల‌కు స‌మాయత్తం చేసే బాధ్య‌త‌లు ఈట‌ల‌కు అప్ప‌జెపుతార‌ని పార్టీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్‌కి రాష్ట్ర సారథ్య బాధ్యతలు కట్టబెట్టడం, పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కొనసాగుతున్న సీనియర్‌ నేత డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ను యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నుకున్న నేపథ్యంలో ఈటలకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఈట‌ల‌కు కీల‌క బాధ్య‌త‌లు?

ప్ర‌స్తుత ప‌రిణామాల‌ నేపథ్యంలో ఈటల, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈటల సేవలను మ‌రింత‌గా వినియోగించుకునేందుకు ఆయనకు పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తారా? లేక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వంటి పదవిని ఇస్తారా అనే చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈట‌ల ఆదివారం నాడు మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్నారు. ఆత‌ర్వాత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అమిత్‌షాతో భేటీ అయ్యారు.

ఈటలతోపాటు ఆయ‌న సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి కూడా అమిత్ షా తో స‌మ‌వేశంలో పాల్గొన్నారు. అనంత‌రం ఈట‌ల మాట్లాడుతూ తాము సుమారు ఇర‌వైనిమిషాల‌పాటు హోంమంత్రి షా తో స‌మావేశ‌మ‌య్యామ‌ని చెప్పారు .రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్ర‌భుత్వం తీరు, తాజా రాజకీయ పరిస్థితులు, అగ్నిపథ్‌ అల్లర్లు త‌దిత‌ర విష‌యాల‌పై చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. కాగా, రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని అమిత్‌ షా సూచించారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఏడాది కిందట ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, టిఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. గత నవంబరులో హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బిజెపి త‌ర‌పున పోటీ చేసి విజయం సాధించారు.

మరో వైపు హుజూరాబాద్ ఎన్నికల నాటి నుంచే ఈటలకు, బండి సంజయ్ కి మధ్య విబేధాలు తీవ్రమయ్యాయని బీజేపీ క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఇద్దరి మధ్య విబేధాలు బహిరంగంగానే వెల్లడి అయ్యాయి. బండి సంజయ్ కన్నా తానే ప్రజా బలం ఉన్న నాయకుడిని అని ఈటల భావిస్తున్నారని, ఇక ఈటల ను ఎలాగైనా కట్టడి చేయాలని బండి సంజయ్ అనుకుంటున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గ‌నక అధినాయకత్వం ఈటల కు ఏదైనా కీలక బాధ్యత అప్పజెప్పితే వీరిద్దరి మధ్య విబేధాలు మరింత తీవ్రమవడం ఖాయమని తెలంగాణ బీజేపీ క్యాడర్ లో ఆందోళన నెలకొంది.

Tags:    
Advertisement

Similar News