పవార్, ఫరూక్ అబ్దుల్లా దారిలో గోపాలకృష్ణ గాంధీ
అదేం విచిత్రమో గానీ రాష్ట్రపతి పదవి ఎన్నిక రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మేమంటే మేం ఉండబోమంటూ ఒకరి తరువాత మరొకరు తప్పుకుంటున్నారు. మొదట ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తమతమ కారణాలు చెప్పి రేసు నుంచి తప్పుకోగా తాజాగా బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా తాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోనని సోమవారం ప్రకటించారు. తనను అభ్యర్థిగా […]
అదేం విచిత్రమో గానీ రాష్ట్రపతి పదవి ఎన్నిక రేసులో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మేమంటే మేం ఉండబోమంటూ ఒకరి తరువాత మరొకరు తప్పుకుంటున్నారు. మొదట ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తమతమ కారణాలు చెప్పి రేసు నుంచి తప్పుకోగా తాజాగా బెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ కూడా తాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయబోనని సోమవారం ప్రకటించారు.
తనను అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు విపక్ష నేతలకు కృతజ్ఞతలని, కానీ చాలా ఆలోచించిన అనంతరం పోటీ చేయరాదని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాష్ట్రపతి అభ్యర్థి జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించవలసిన అవసరం ఉందని భావిస్తున్నానని, అందువల్ల ఈ పదవికి తనకన్నామెరుగైన ఇతర అభ్యర్థులు ఉంటారని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ కారణం వల్లే అలాంటివారికి అవకాశం ఇవ్వాలని విపక్ష నాయకులను కోరుతున్నా అని గోపాలకృష్ణ గాంధీ అన్నారు. చివరి గవర్నర్ జనరల్ రాజాజీ వంటి వారు, తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వంటివారు ఈ దేశానికి రాష్ట్రపతి కావాలని ఆయన కోరుతున్నారు.
జూలై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ రేసులో ముందున్నారని వార్తలు వస్తున్నవేళ.. ఈ తాజా పరిణామం చోటు చేసుకోవడం విశేషం. దీంతో తదనంతర కార్యాచరణపై చర్చించేందుకు విపక్షాలు మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మళ్ళీ రెండో దఫా సమావేశమవుతాయని తెలుస్తోంది. ఈ సమావేశానికి శరద్ పవార్ అధ్యక్షత వహించనున్నారు. మొదటి భేటీకి బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అధ్యక్షత వహించారు. కానీ ఆ సమావేశంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. మొదట ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణ గాంధీ పేర్లను మమత సూచించారు. కొద్దిసేపటికే శరద్ పవార్ పేరుకూడా ప్రస్తావనకు వచ్చింది. కానీ పవార్ వెంటనే ఈ ఆఫర్ తిరస్కరించారు.
ఇక ఫరూక్ అబ్దుల్లా.. తన సేవలు జమ్మూకాశ్మీర్ కి చాలా అవసరమని, ఈ కేంద్రపాలిత ప్రాంతానికి తాను చేయవలసింది ఎంతో ఉందని, అందువల్ల తాను కూడా తప్పుకుంటున్నానని ప్రకటించారు. మరోవైపు రాష్ట్రపతి పదవికి విపక్షాలతో కలిసి అన్ని పార్టీల ఆమోదంతో ఒక అభ్యర్థిని నిర్ణయించి.. ఏకాభిప్రాయాన్ని సాధించాలని బీజేపీ సంకల్పించింది. వాటితో సంప్రదింపులు జరిపే బాధ్యతను పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు అప్పగించింది.