మాజీ సైనికుల రిజర్వేషన్లకే దిక్కు లేదు…. ఇక అగ్నివీర్ లకు రిజర్వేషనా ? ప్రభుత్వ డాటా చెప్తున్న నిజాలు

అగ్నిపథ్ పథకాన్ని గొప్పదిగా చూపేందుకు కేంద్రం చెప్తున్న కొన్ని అంశాల్లో రిటైర్ అయిన అగ్నివీర్ లకు రిజర్వేషన్ల అంశం. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల (PSU)లో అగ్నివీర్లకు 10% కోటాను కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన 10 శాతం కోటా నిజంగానే అమలవుతుందా ? అగ్నిపథ్ పథకం అమలు ప్రారంభంకాకముందే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయడంపై విమర్శ‌లు రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇటువంటి అనుమానాలపై ఆగ్రహం కూడా […]

Advertisement
Update:2022-06-20 08:34 IST

అగ్నిపథ్ పథకాన్ని గొప్పదిగా చూపేందుకు కేంద్రం చెప్తున్న కొన్ని అంశాల్లో రిటైర్ అయిన అగ్నివీర్ లకు రిజర్వేషన్ల అంశం. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల (PSU)లో అగ్నివీర్లకు 10% కోటాను కేంద్రం ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన 10 శాతం కోటా నిజంగానే అమలవుతుందా ?

అగ్నిపథ్ పథకం అమలు ప్రారంభంకాకముందే ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేయడంపై విమర్శ‌లు రావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఇటువంటి అనుమానాలపై ఆగ్రహం కూడా రావచ్చు. అయితే ఇప్పటి వరకు మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేయబడ్డ ఉద్యోగాల్లో వారిని ఎంత వరకు నియమించారన్నది చూస్తే ప్రస్తుత అగ్నివీరుల రిజర్వేషన్ గురించి ఒక అంచనాకు రావచ్చు.

ఈ విషయంపై మనం ఒక అంచనాకు వచ్చే ముందు అధికారిక లెక్కలనే పరిగణన లోకి తీసుకుందాం.
మాజీ సైనికుల సంక్షేమ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (DGR) వద్ద అందుబాటులో ఉన్న తాజా డేటా (జూన్ 30, 2021 నాటికి) ఆధారంగా ఈ గణాంకాలను ఒక్క సారి పరిశీలిద్దాం.

ఈ లెక్కల ప్రకారం మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేయబడ్డ అనేక ఉద్యోగాల్లో ప్రస్తుతం ఇతరులు పని చేస్తున్నారు. వాళ్ళకిచ్చిన రిజర్వేషన్ పర్సెంటేజ్ కన్నా చాలా తక్కువ శాతం మాజీ సైనికులకు ఉద్యోగాలు లభించాయి.

డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (DGR) డేటా ప్రకారం…

కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్ సీ ఉద్యోగాల్లో 10% పోస్టులు మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. అయితే , 77 కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని 34 విభాగాల్లో 1.29% శాతం పోస్టులు మాత్రమే మాజీ సైనికులతో భర్తీ చేశారు. గ్రూప్ డీ పోస్టుల్లో 20% రిజర్వేషన్ ఉంటే అందులో 2.66% మాత్రమే మాజీ సైనికులతో భర్తీ చేశారు.

34 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10,84,705 మంది గ్రూప్‌ సి ఉద్యోగుల్లో 13,976 మంది మాత్రమే మాజీ సైనికులుండగా, 3,25,265 మంది గ్రూప్ డి ఉద్యోగుల్లో 8,642 మంది మాత్రమే మాజీ సైనికులున్నారు.

సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CPMF)లో అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి వరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో మాజీ సైనికులకు 10% కోటా ఉంది. కానీ, జూన్ 30, 2021 నాటికి CPMFల మొత్తం ఉద్యోగుల్లో, మాజీ సైనికులు గ్రూప్ C ఉద్యోగులు 0.47% మాత్రమే ఉన్నారు (మొత్తం 8,81,397లో 4,146); గ్రూప్ Bలో 0.87% (61,650లో 539); గ్రూప్ Aలో 2.20% (76,681లో 1,687) ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో , మాజీ సైనికుల కోటా, గ్రూప్ సి పోస్టులలో 14.5% , గ్రూప్ డి పోస్టులలో 24.5%గా నిర్ణయించబడింది. కానీ, డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ ప్రకారం, 170 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని 94సంస్థల్లో మాజీ సైనికులు గ్రూప్ C ఉద్యోగాల్లో కేవలం 1.15% (మొత్తం 2,72,848 మందిలో 3,138), గ్రూప్ D ఉద్యోగాల్లో 0.3% (1,34,733లో 404) మాత్రమే ఉన్నారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాజీ సైనికుల కోసం గ్రూప్ సిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం 14.5% రిజర్వేషన్లు, గ్రూప్ డిలో 24.5% రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. కాగా గ్రూప్ C ఉద్యోగాల్లో 9.10% (మొత్తం 2,71,741 మందిలో 24,733) , గ్రూప్ D ఉద్యోగాల్లో 21.34% (మొత్తం 1,07,009 మందిలో 22,839) ఉన్నారు.

ఎందుకు మాజీ సైనికుల రిజర్వేషన్లన్లు అమలు జరగడంలేదన్న ప్రశ్నకు జవాబు కూడా డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (DGR) తన నివేదికలో ప్రస్తావించింది.

1. తగినంత సంఖ్యలో మాజీ సైనికులుఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడం లేదు,
2. చాలా మంది మాజీ సైనికులకు ఆ ఉద్యోగాలకు కావాల్సిన‌ అర్హత లేదు.
3. ఎంపిక ప్రమాణాలకు సంబంధించిన సడలించిన ఉత్తర్వులను ఆయా సంస్థలు అమలు చేయడం లేదు.

జూన్ 30, 2021 నాటికి, మొత్తం మాజీ సైనికుల సంఖ్య 26,39,020. ఇందులో ఆర్మీ నుండి 22,93,378, నేవీ నుండి 1,38,108, వైమానిక దళం నుండి 2,07,534 మంది ఉన్నారు.

ఈ డాటా మొత్తం మన సొంతంగా తయారు చేసింది కాదు స్వయంగా రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్‌మెంట్ (DGR) దగ్గరున్న డాటా ఇది. ఈ డాటా ప్రకారం పూర్తి శిక్షణ పొంది అనేక సంవత్సరాలపాటు మిలటరీలో సేవలందించి, అన్ని నైపుణ్యాలున్న వారికే, వారికి కేటాయించిన రిజర్వేషన్లు అమలు జరగడం లేదు. అలాంటి వాళ్ళే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. మరి నాలుగు సంవత్సరాలే పని చేసి ఏదో కొద్ది పాటి నైపుణ్యంతో బైటికొచ్చే అగ్నివీరులకు కేంద్రం ఇస్తామని చెప్తున్న రిజర్వేషన్లు అమలు జరుగుతాయని ఆశించ‌వచ్చా ?

ఈ డాటా చూసిన తర్వాత అగ్నివీరులకు కేంద్రం ఇస్తామని చెప్తున్న రిజర్వేషన్లు అమలవుతాయా అని అనుమానాలు రావడంలో న్యాయముంది కదా !

Tags:    
Advertisement

Similar News