కోవిడ్ కి ‘ముక్కు వ్యాక్సిన్’ వచ్చేస్తోంది.. మూడో దశ ట్రయల్స్ పూర్తి
ఇండియాలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న వేళ.. భారత్ బయోటెక్ సంస్థ చల్లని కబురు వినిపించింది. కరోనాకు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ కి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ ఇదివరకే పూర్తయ్యాయని భారత్ బయో టెక్ చైర్మన్, ఎండీ డా. కృష్ణా ఎల్లా ప్రకటించారు. ప్రపంచంలోనే ఇది తొలి నాసల్ వ్యాక్సిన్ అవుతుందన్నారు. ఈ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గత జనవరిలోనే అనుమతించిందని, ఇవి పూర్తి అయ్యాయి […]
ఇండియాలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్న వేళ.. భారత్ బయోటెక్ సంస్థ చల్లని కబురు వినిపించింది. కరోనాకు ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ కి సంబంధించిన మూడో దశ ట్రయల్స్ ఇదివరకే పూర్తయ్యాయని భారత్ బయో టెక్ చైర్మన్, ఎండీ డా. కృష్ణా ఎల్లా ప్రకటించారు. ప్రపంచంలోనే ఇది తొలి నాసల్ వ్యాక్సిన్ అవుతుందన్నారు. ఈ పరీక్షలకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) గత జనవరిలోనే అనుమతించిందని, ఇవి పూర్తి అయ్యాయి గనుక వచ్చే నెలలో తాము డేటాను సమర్పించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.
క్లినికల్ ట్రయల్ ఇప్పుడే ముగిసిందని, డేటా విశ్లేషణ కొనసాగుతోందని చెప్పిన ఆయన.. ఇక జాప్యం చేయకుండా జులైలో డేటా సమర్పిస్తామన్నారు. అన్నీ సక్రమంగా జరిగితే ఈ వ్యాక్సిన్ లాంచ్ కి అనుమతి లభిస్తుందని, అప్పుడు వరల్డ్‌లోనే క్లినికల్ గా ప్రూవ్ అయిన తొలి నాసల్ వ్యాక్సిన్ ఇదే అవుతుందని వివరించారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ గురించి ప్రస్తావిస్తూ.. రెండో డోస్ తీసుకున్నవారు తప్పనిసరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు. ఇది రోగనిరోధక శక్తినిస్తుందని, ప్రతి వ్యాక్సినేషన్ కు బూస్టర్ డోస్ మిరకిల్ అని ఎప్పుడూ చెబుతుంటానని కృష్ణా ఎల్లా అన్నారు.
పిల్లల్లో కూడా మొదటి రెండు డోసుల వ్యాక్సిన్ అంతగా ఇమ్యూనిటీని ఇవ్వదని, కానీ మూడవది మంచి ఫలితాలనిస్తుందని ఆయన చెప్పారు. పెద్దలకు కూడా ఇదే వర్తిస్తుందని, మూడో డోసు ముఖ్యమైనదని పేర్కొన్నారు. కోవిడ్ ని వంద శాతం పూర్తిగా నిర్మూలించలేం.. దీనితో మనం సహజీవనం చేయాల్సిందే.. దీన్ని తెలివిగా ఎలా అదుపు చేయాలన్నది తెలుసుకోవలసి ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫ్రాన్స్ లో జరుగుతున్న వైవా టెక్ -2022 సదస్సు గురించి కృష్ణా ఎల్లా మాట్లాడుతూ .. ఇది ఇండియాకు ఎంతో గొప్ప విజయం వంటిదని ఈ దేశంలో మన దేశానికి మంచి పేరు రావడానికి దోహదపడుతోందని అన్నారు. ఇండియా నుంచి నీతి ఆయోగ్ కింద 65 స్టార్టప్ లు రావడం హర్షించదగిన విషయమని, ఇండియా టెక్నాలజీ రంగంలో ఏం చేయగలదో ఇవి నిరూపించాయని ఆయన చెప్పారు. ప్రపంచాన్ని భారత్ ఎలా ఇన్నోవేట్ చేసిందీ అందరికీ అర్థమైందన్నారు. 1997 లో తాను కూడా ఓ స్టార్టప్ నే అని చమత్కరించారు. మొదట అమెరికా.. స్టార్టప్ లకు కేంద్రంగా ఉండగా మొదటిసారిగా ఫ్రాన్స్ లో భారతీయులు తమ సత్తా చూపారని కృష్ణా ఎల్లా పేర్కొన్నారు.
కాగా-ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ నాసల్ స్ప్రే వంటిదేనని, సాధారణంగా చేతికి సూది ద్వారా ఇచ్చే టీకా కన్నా ఇది నేరుగా శ్వాస కోశ నాళానికి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా దీన్ని తీసుకోవడానికి హెల్త్ వర్కర్లు కూడా అవసరం లేదని, సాధారణ వ్యాక్సిన్ మాదిరే ఇది కూడా యాంటీబాడీలను డెవెలప్ చేయగలదని వారు ఇదివరకే పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ వల్ల ముక్కులో ఇమ్యూన్ రెస్పాన్స్ పెరుగుతుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్క్యూల్ ఆఫ్ మెడిసిన్ గతంలోనే తన స్టడీలో వివరించింది. ఒకవిధంగా చెప్పాలంటే దీన్ని ‘గేమ్ ఛేంజర్’ గా ఈ సంస్థ అభివర్ణించింది.