మేము మీ వెంటే… ఆందోళనకారులకు సోనియా గాంధీ హామీ

అగ్నిపథ్ పథకానికి నిరసనగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరసనకారులకు తాము మద్దతునిస్తున్నామని ప్రకటించారు. మేము మీ వెంటే అని వారి ఆందోళనను సమర్థించారు. కోవిడ్ అనంతర రుగ్మతలకు గాను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆస్పత్రి బెడ్ పై నుంచే ప్రకటన చేశారు. తమ పార్టీ మీకు అండగా ఉంటుందని, ఈ పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తుందని ఆమె తెలిపారు. […]

Advertisement
Update:2022-06-18 13:06 IST

అగ్నిపథ్ పథకానికి నిరసనగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెల్లుబికిన నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిరసనకారులకు తాము మద్దతునిస్తున్నామని ప్రకటించారు. మేము మీ వెంటే అని వారి ఆందోళనను సమర్థించారు. కోవిడ్ అనంతర రుగ్మతలకు గాను ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆస్పత్రి బెడ్ పై నుంచే ప్రకటన చేశారు. తమ పార్టీ మీకు అండగా ఉంటుందని, ఈ పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యత్నిస్తుందని ఆమె తెలిపారు. ఈ స్కీం కి ఓ దిశ అంటూ లేదని, ఆర్మీలో చేరగోరే అభ్యర్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా కేంద్రం ప్రకటించిందని ఆరోపించారు.

మీ గళాలను వినిపించుకోకుండా ప్రభుత్వం ఈ కొత్త సైనిక పథకాన్ని ప్రకటించింది.. దీనికి దిశ అంటూ లేదు.. అనేకమంది మాజీ సైనికోద్యోగులు కూడా దీని పట్ల సందేహాలను వ్యక్తం చేశారు అని సోనియా పేర్కొన్నారు. ఈ ప్రకటనను పార్టీ నేత జైరాం రమేష్ ట్విట్టర్లో షేర్ చేశారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా మీరు ఆందోళన చేస్తున్నారని, మీ ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న హామీకి పార్టీ పూర్తిగా కట్టుబడి ఉంటుందని సోనియా నిరసనకారులను ఉద్దేశించి స్పష్టం చేశారు.

ఎలాంటి హింసకు తావు లేకుండా సహనంతో, శాంతియుతంగా మా గళాలను వినిపిస్తామని ఆమె అన్నారు. తమ దేశభక్తిని ఎవరూ శంకించజాలరన్నారు. అంతకు ముందు సోనియా కుమారుడు, పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. యువత డిమాండును ప్రధాని మోడీ అంగీకరించాలని, వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను ఎలా వెనక్కి తీసుకున్నారో అలాగే ఈ పథకాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.

10 శాతం కోటా ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్

రక్షణ రంగంలో నియామకాలకు గాను అర్హత పొందిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదనకు రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆమోద ముద్ర వేశారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లోను, అస్సాం రైఫిల్స్ లోను అగ్నివీరులకు 10 శాతం కోటాకు సంబంధించిన ప్రతిపాదనను హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీన్ని రాజ్ నాథ్ సింగ్ ఆమోదించారు. ఇండియన్ కోస్ట్ గార్డు సహా డిఫెన్స్ సివిలియన్ పోస్టుల్లో, 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోను ఈ రిజర్వేషన్ ను అమలు చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఈ నిబంధనలను అమలు చేసేందుకు రిక్రూట్మెంట్ రూల్స్ లో తగిన సవరణలు చేస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే వయో పరిమితి సడలింపునకు సంబంధించి కూడా నిబంధనలను సవరించడం జరుగుతుందని పేర్కొంది.

ప్రధాని మోడీ ప్రసంగంలో కనబడని ‘నిరసనల పర్వం’

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ శనివారం వడోదరలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన గుజరాత్ లో మహిళా సాధికారత గురించి.. అయోధ్యలో రామాలయం గురించి, వారణాసి లోని కాశీ విశ్వనాధ్ డ్యామ్ గురించి ప్రస్తావించారు. దేశం ఇప్పుడు పురాతన సంస్కృతితో కూడిన ఐడెంటిటీతోనే అధునాతన సంస్కృతితో ముందుకు వెళ్తోందన్నారు. అగ్నిపథ్ పథకం పై దేశంలో యువత చేస్తున్న ఆందోళనల గురించి మోడీ ప్రస్తావించకపోవడం విశేషం.

Tags:    
Advertisement

Similar News