‘పది లక్షల ఉద్యోగాలా ..? మహా బోగస్ హామీ’.. రాహుల్ గాంధీ ధ్వజం

ఒకటిన్నర సంవత్సరాల్లో కనీసం 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రధాని మోదీ కేంద్ర మంత్రిత్వ శాఖలను, వివిధ డిపార్ట్ మెంట్లను ఆదేశిస్తూ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. ఇది మరో పెద్ద బూటకపు హామీ అని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తనను ఈడీ అధికారులు విచారిస్తుండగా ..మధ్య లంచ్ బ్రేక్ లో ఆయనకీ విషయం తెలిసింది. అంతే ! ఎనిమిదేళ్ల క్రితమే ప్రతి ఏడాదీ యువతకు 2 కోట్ల […]

Advertisement
Update:2022-06-14 14:59 IST

ఒకటిన్నర సంవత్సరాల్లో కనీసం 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రధాని మోదీ కేంద్ర మంత్రిత్వ శాఖలను, వివిధ డిపార్ట్ మెంట్లను ఆదేశిస్తూ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. ఇది మరో పెద్ద బూటకపు హామీ అని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తనను ఈడీ అధికారులు విచారిస్తుండగా ..మధ్య లంచ్ బ్రేక్ లో ఆయనకీ విషయం తెలిసింది. అంతే ! ఎనిమిదేళ్ల క్రితమే ప్రతి ఏడాదీ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేశారని, ఇప్పుడు అలాగే ఈ హామీనిస్తున్నారని ఆయన వెంటనే ట్వీట్ చేశారు.

ఇది మామూలు ప్రభుత్వ హామీ కాదని, ఇది మహా బూటకపు హామీల ప్రభుత్వమని రాహుల్ అన్నారు. ఉద్యోగాలను కల్పించడంలో ప్రధాని నిపుణుడు కాదని, కానీ ‘జాబ్స్’ మీద ‘న్యూస్’ క్రియేట్ చేయడంలో సిద్ద హస్తుడని ఆయన విమర్శించారు. అన్ని ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలెన్ని ఉన్నాయో సమీక్ష జరిపిన అనంతరం ప్రధాని మోడీ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో మానవ వనరులకు సంబంధించి స్థాయీ స్థితి గతులను ఆయన రివ్యూ చేశారని , రానున్న ఒకటిన్నర సంవత్సరాల్లో 10 లక్షల మందికి జాబ్స్ ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారని ఈ కార్యాలయం ట్వీట్ చేసింది. అనేక ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి.

కొత్తగా ప్రకటించిన ఈ పథకం కింద వీటిని భర్తీ చేస్తారు. మోడీ ఆదేశాల మేరకు తమ మంత్రిత్వ శాఖలోని ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించామని హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అగ్నిపథ్ పథకం కింద పదిహేడున్నర, 21 ఏళ్ళ మధ్య వయసున్న వారిలో సుమారు 45 వేలమందిని నాలుగేళ్ల కాలానికి గాను సాయుధ దళాల్లోకి తీసుకుంటారు. వచ్చే 90 రోజుల్లోగా రిక్రూట్ మెంట్ ప్రారంభమవుతుందని, మొదటి బ్యాచ్ వచ్చే ఏడాది జులై నాటికి సిద్దమవుతుందని తెలుస్తోంది. సాయుధ దళాల్లో మరింతమంది యువకులను నియమించేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు.

నాలుగేళ్ల తరువాత సైనికులకు విధుల నుంచి స్వేచ్ఛనిస్తారని, టాప్ ప్రొఫెషనల్స్ లో 25 శాతం మందిని మళ్ళీ తీసుకుంటారని చెబుతున్నారు. సెంట్రలైజ్డ్ ఆన్ లైన్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది. మహిళలకు కూడా ఈ అగ్నిపథ్ పథకాన్ని వర్తింప జేయనున్నారు. ‘అగ్నివీరు’లకు నెలకు 30 వేల నుంచి 40 వేల రూపాయలవరకు వేతనాలు, అలవెన్సులు లభిస్తాయి. వీరికి మిలిటరీ శిక్షణ ఉంటుంది.

నాలుగేళ్ల అనంతరం పర్మనెంట్ కేడర్ లో రిజిస్ట్రేషన్ కోసం స్వచ్చందంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ దరఖాస్తులను వీరి మెరిట్ ప్రకారం పరిశీలిస్తారు. దాదాపు 25 శాతం దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంటుందని సమాచారం. రెగ్యులర్ కేడర్ లో ఎంపికయినవారు కనీసం 15 ఏళ్లపాటు తప్పనిసరిగా సర్వీసు చేయాల్సి ఉంటుంది. రష్యా, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి ఇతర దేశాల్లోనూ ఈ విధమైన పథకాలు ఉన్నాయని అధికారులు గుర్తు చేస్తున్నారు. అంటే తమ దేశాల భద్రతను పెంచుకునేందుకు ఈ దేశాలు ఇలాంటి పథకాలను అమలు చేస్తున్నాయని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News