పార్టీనుంచి సస్పెండ్ చేస్తే చాలదు.. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాల్సిందే..

నుపుర్ శర్మ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలకు కారణం అవుతోంది. ఆమెను పార్టీ అధికార ప్రతినిధి పదవినుంచి సస్పెండ్ చేసి బీజేపీ చేతులు కడుక్కోవాలనుకుంది. కానీ మైనార్టీ వర్గాలు మాత్రం ఆమెను అరెస్ట్ చేసే వరకు తమ నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాయ్. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాశ్మీర్ నుంచి కర్నాటక వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జమ్మూ కాశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌, […]

Advertisement
Update:2022-06-11 01:53 IST

నుపుర్ శర్మ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలకు కారణం అవుతోంది. ఆమెను పార్టీ అధికార ప్రతినిధి పదవినుంచి సస్పెండ్ చేసి బీజేపీ చేతులు కడుక్కోవాలనుకుంది. కానీ మైనార్టీ వర్గాలు మాత్రం ఆమెను అరెస్ట్ చేసే వరకు తమ నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాయ్. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాశ్మీర్ నుంచి కర్నాటక వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

జమ్మూ కాశ్మీర్‌, ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కర్నాటక సహా వివిధ రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. చాలాచోట్ల ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బెంగాల్‌ లో బీజేపీ కార్యాలయానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

కాశ్మీర్ లో ఇంటర్నెట్ బంద్..
నుపుర్‌, జిందాల్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జమ్ముూ కాశ్మీర్‌ లోని డొడా, కిస్తి వాడ్‌, శ్రీనగర్‌ లోని పలు ప్రాంతాల్లో వందలాదిమంది నిరసన కారులు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు చేపట్టారు. భద్రతా దళాలు అడ్డుకోవడంతో కొంతమంది వారిపై రాళ్లు రువ్వారు. పరిస్థితి అదుపులోకి తేవడానికి పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ పై నిషేధం విధించారు.

ఢిల్లీలోని జామా మసీదు ముందు నిరసన కార్యక్రమం జరిగింది. అయితే నిరసనలకు తాము పిలుపునివ్వలేదని జామియా మసీదు షాహీ ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుఖారి స్పష్టం చేయడం విశేషం. ఆందోళనకారులెవరో తమకు తెలియదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పంజాబ్‌ లోకూడా చాలా చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి.

దద్దరిల్లిన యూపీ
యూపీ రాజధాని లక్నోతో పాటు మొరాదాబాద్‌, రామ్‌ పూర్‌, ప్రయాగ్‌ రాజ్‌ లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేశారు. ప్రయాగ్‌ రాజ్‌ లో కొంద రు నిరసనకారులు రాళ్లు రువ్వగా, పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. లక్నో, ప్రయాగ్‌ రాజ్‌ ప్రాంతాల్లో అప్రకటిత కర్ఫ్యూ విధించారు. దుకాణాలు అన్నీ మూసివేశారు. సహారన్‌ పూర్‌ లో 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

జార్ఘండ్ రాజధాని రాంచీలో హనుమాన్ మందిరం వద్ద నిరసన ప్రదర్శన జరగడంతో కలకలం రేగింది. పోలీసులు వారిపై లాఠీ చార్జి చేశారు. ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. చివరిగా గాల్లోకి కాల్పులు జరపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అక్కడ కర్ఫ్యూ అమలులో ఉంది. మరోవైపు బీహార్ లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్ కతా సహా ఇతర ప్రాంతాల్లో నిరసనకారులు రైల్వే ట్రాక్ లపైకి దూసుకొచ్చారు. పలు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ట్రాక్ పైకి వచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తే.. వారిపై రాళ్లు రువ్వారు. ముంబైలో మహిళలు పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. నుపుర్, జిందాల్ ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు, అధికారులకు వినతిపత్రాలు అందించారు.

హైదరాబాద్‌ మక్కామసీదు వద్ద మైనార్టీ వర్గాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని వారు ఖండించారు. మెహిదీపట్నంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. లాఠీచార్జి తర్వాత కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారంతో బీజేపీ భారీగానే మూల్యం చెల్లించుకునేట్టు ఉంది. నుపుర్ శర్మపై పార్టీ వేటు వేసినా.. ఆమెను బీజేపీకి చెందిన వ్యక్తిగానే, ఆమె వ్యాఖ్యలను బీజేపీ వ్యాఖ్యలుగానే ప్రజలు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News