అరెస్టయిన నేతలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయలేరన్న కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికెవరు ‘దిక్కు’ ?

మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి పెద్ద చిక్కొచ్చి పడింది. రేపు (శుక్రవారం) రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. సర్కార్ కి ముంబై కోర్టు షాకిచ్చింది.. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని, బెయిల్ మంజూరు చేయాలని మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్, మరో మంత్రి నవాబ్ మాలిక్ దాఖలు చేసుకున్న పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. వీరికి తాత్కాలికంగా బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఈడీ రెండు రోజులముందే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన […]

Advertisement
Update:2022-06-09 12:02 IST

మహారాష్ట్రలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి పెద్ద చిక్కొచ్చి పడింది. రేపు (శుక్రవారం) రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా.. సర్కార్ కి ముంబై కోర్టు షాకిచ్చింది.. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని, బెయిల్ మంజూరు చేయాలని మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్, మరో మంత్రి నవాబ్ మాలిక్ దాఖలు చేసుకున్న పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.

వీరికి తాత్కాలికంగా బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఈడీ రెండు రోజులముందే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.., మహారాష్ట్రలో 6 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఏడుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. నిజానికి అనిల్ దేశ్ ముఖ్, నవాబ్ మాలిక్ ల ఓట్లు ఈ ఎన్నికల్లో ఎంతో కీలకం. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి నవాబ్ మాలిక్ ని గత ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేశాక అప్పటినుంచి ఆయన జైల్లో ఉన్నారు. ఇలాగే ఈ విధమైన ఆవినీతి ఆరోపణలతోనే అరెస్టయిన మాజీ హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

‘బాబ్బాబూ ! మాకు ఒక్కరోజు బెయిల్ ఇస్తే మేం రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తాం’ అని వీరిద్దరూ కోర్టును అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. ఖైదీలకు ఓటు హక్కులు లేవన్న ఈడీ అధికారుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. వీరి పిటిషన్లను తిరస్కరించింది. వీరిద్దరూ ఎన్సీపీకి చెందిన నేతలే ! మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని ప్రభుత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో విపక్ష బీజేపీ మంచి ఛాన్సే కొట్టేసింది.

ఈ పార్టీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి కోవిడ్ నెగటివ్ రావడంతో.. ఆయన రేపు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని సంపాదించారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాల తరువాత మొదటిసారిగా ఏడుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. శివసేన ఇద్దరు అభ్యర్థులను.. సంజయ్ రౌత్, సంజయ్ పవార్ లను నిలబెట్టగా విపక్ష బీజేపీ నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ అభ్యర్థులుగా ఉన్నారు.

ఇక ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నుంచి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి రంగంలో నిలిచారు. ముఖ్యంగా ఇమ్రాన్ గర్హిని కాంగ్రెస్ ఎంపిక చేయడంతో నటి, కాంగ్రెస్ నేత నగ్మా ఇటీవల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఏ అభ్యర్థి రాజ్యసభ సీటును గెలవాలన్నా అతనికి 42 ఓట్లు పడవలసి ఉంటుంది. శివసేన ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీకి ఈ ఎన్నికలు ‘ప్రయోజనకరం’గానే ఉన్నట్టు కనిపిస్తోంది.

6 సీట్లకు గాను మూడింటిని గెలుచుకోవడానికి తగినంత మంది సభ్యులు ఉన్నారు. వీరికోసం 288 మంది ఎమ్మెల్యేలు ఓటు చేయవలసి ఉంటుంది. అసెంబ్లీలో తమకు 106 మంది సభ్యులున్న బీజేపీ సొంతంగా ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోగలదు. అయితే ఆరో సీటు కోసం శివసేనకు చెందిన సంజయ్ పవార్ పై పోటీకి తమ మూడో అభ్యర్థిగా ధనంజయ్ మహాదిక్ ని ఈ పార్టీ నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో ఎవరు విజేతలవుతారో .. వీరి విషయంలో చిన్నా, చితకా పార్టీలకు చెందిన 29 మంది ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు.

బీజేపీకి 22 మిగులు ఓట్లు ఉన్నాయట.. ఏడుగురు ఇండిపెండెంట్ సభ్యుల మద్దతు తమకుందని ఈ పార్టీ చెప్పుకుంటోంది. మరో 13 మంది సపోర్ట్ కోసం ప్రయత్నిస్తోంది. ఇక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాయి. ప్రత్యర్థి పార్టీలు వీళ్ళను ఎక్కడ ఎగరేసుకుపోతాయోనన్న భయంతో ఇందుకు అప్పుడే వారిని పంపేశాయి. ఈ ఎన్నికల్లో తమ జేడీ-ఎస్ అభ్యర్థికి మద్దతునివ్వాలని కర్ణాటక మాజీ సీఎం, ఈ పార్టీ నేత హెచ్.డీ.కుమారస్వామి .. కాంగ్రెస్ పార్టీని కోరుతున్నారు. సెక్యులర్ శక్తులు బలోపేతం కావాలంటే మా అభ్యర్థికి సపోర్టునివ్వండి అని ఆయన కాంగ్రెస్ నేతలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీని ఓడించడమే మన లక్ష్యం కావాలన్నారాయన.

Tags:    
Advertisement

Similar News