వ్యాక్సినే కాదు మెడిసిన్ కూడా.. కరోనా పరిశోధనల్లో సరికొత్త ఆవిష్కరణ
కరోనా నియంత్రణకు ఇప్పటి వరకూ మనకున్న ఏకైక ఆప్షన్ టీకా. అయితే టీకా తీసుకున్నా కూడా కొంతమందికి కొవిడ్ వైరస్ సోకడం గమనార్హం. ఇక కరోనా సోకిన తర్వాత వాడే మందుల విషయంలో ఇప్పటి వరకూ వైద్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు. హెవీ డోస్ స్టెరాయిడ్స్ వాడకంతో కరోనా లోడ్ తగ్గించినా.. సైడ్ ఎఫెక్ట్స్ చాలామందిని ఇబ్బంది పెట్టాయి. కరోనా ఫస్ట్ వేవ్ కి, సెకండ్ వేవ్ కి, థర్డ్ వేవ్ కి.. మందుల్లో మార్పులొచ్చాయి కానీ, […]
కరోనా నియంత్రణకు ఇప్పటి వరకూ మనకున్న ఏకైక ఆప్షన్ టీకా. అయితే టీకా తీసుకున్నా కూడా కొంతమందికి కొవిడ్ వైరస్ సోకడం గమనార్హం. ఇక కరోనా సోకిన తర్వాత వాడే మందుల విషయంలో ఇప్పటి వరకూ వైద్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు. హెవీ డోస్ స్టెరాయిడ్స్ వాడకంతో కరోనా లోడ్ తగ్గించినా.. సైడ్ ఎఫెక్ట్స్ చాలామందిని ఇబ్బంది పెట్టాయి. కరోనా ఫస్ట్ వేవ్ కి, సెకండ్ వేవ్ కి, థర్డ్ వేవ్ కి.. మందుల్లో మార్పులొచ్చాయి కానీ, దేన్నీ నివారణ ఔషధం అని చెప్పలేని పరిస్థితి.
అయితే ఇప్పుడు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) శాస్త్రవేత్తలు కరోనాకు ఔషధాన్ని కనిపెడుతున్నట్టు ప్రకటించారు. పెప్టైడ్ లు, మినీ ప్రొటీన్‌లు కొవిడ్ వైరస్ తీవ్రతను తగ్గిస్తున్నట్టు తమ పరిశోధనలో వెళ్లడైనట్టు తెలిపారు శాస్త్రవేత్తలు. వైరస్ కణాలను నిర్వీర్యం చేయడంతోపాటు, కణాలలోకి వైరస్ ప్రవేశాన్ని కూడా ఇవి అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఎలుకలపై జరిగిన ట్రయల్స్ మంచి ఫలితాలను ఇచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో కొవిడ్-19ని నివారించే యాంటీ వైరల్ డ్రగ్స్ ఆవిష్కరణలో మరో ముందడుగు పడినట్టు తెలిపారు IISC అసోసియేట్ ప్రొఫెసర్ జయంత చటర్జీ.
మినీప్రొటీన్ లు ఎలా పనిచేస్తాయి..?
సాధారణంగా మనం తీసుకునే ఔషధాల్లోని అణువులు ప్రొటీన్లను బంధిస్తాయి. యాంటీ వైరల్ డ్రగ్ లోని అణువులు కూడా ప్రొటీన్లతో కలసి ప్రయాణిస్తాయి. ఆ తర్వాత అవి విడిపోయి డైమర్లుగా మారతాయి. వీటి ప్రభావంతో వైరస్ కణజాలం బలహీనపడుతుంది. ఇక వైరస్ లు విచ్ఛిన్నమైతే వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. యాంటీ వైరల్ డ్రగ్ ప్రభావంతో.. వైరస్ కణాలు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అంటే వాటి ప్రభావం క్రమక్రమంగా తగ్గుతుందనమాట. మ్యుటేషన్లకు అవకాశం కూడా ఉండదు.
ఈ అధ్యయనంలో వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రొటీన్ ను, ఔషధంలోని మినీ ప్రొటీన్లు బంధిస్తున్నట్టు గుర్తించారు. వైరస్ లోని స్పైక్ ప్రొటీన్, మానవ కణజాలంలోని ACE2 ప్రోటీన్ మధ్య పరస్పర చర్యకోసం SIH – 5 అనే మినీప్రొటీన్ ను శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఈ SIH – 5 అనే మినీ ప్రొటీన్ ను చిట్టెలుకలపై ప్రయోగించినప్పుడు వాటిలోని కొవిడ్ వైరస్ లోడ్ తగ్గినట్టు గుర్తించారు. ఊపిరితిత్తుల పనితీరుపై కూడా ఎలాంటి దుష్ప్రభావం లేదు. దీంతో ఈ మినీప్రొటీన్ లపై శాస్త్రవేత్తలకు గురి కుదిరింది. త్వరలో మానవులపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు.