తెలంగాణకు రుచించని విధ్వంస భాష !!

”తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి.మసీదులు తవ్వుతాం. మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోంది. కరీంనగర్‌ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా, వేములవాడ రాజన్న గుడిలోని దర్గా తొలగించబడాలన్నా రామరాజ్యం రావల్సిందే”. అని ఇటీవల టీబీజేపీ అధ్యక్షుడు బండి […]

Advertisement
Update:2022-06-03 09:02 IST

తెలంగాణలోనూ మసీదులను తవ్వితే శివలింగాలు కనిపిస్తాయి.మసీదులు తవ్వుతాం. మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి.

బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోంది. కరీంనగర్‌ నడిబొడ్డున ఉన్న ఈద్గా పోవాలన్నా, వేములవాడ రాజన్న గుడిలోని దర్గా తొలగించబడాలన్నా రామరాజ్యం రావల్సిందే”. అని ఇటీవల టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.అయితే తెలంగాణ సామాజిక జీవనంలో ఉద్రిక్తతలకు,మతపరమైన కల్లోలాలకు ప్రజలు సుముఖంగా లేరు.

ప్రభుత్వం పాలనా వైఫల్యాల మీద గురిపెట్టడం వలన మాత్రమే ప్రయోజనం లేదని భారతీయ జనతాపార్టీ అనుకుంటోంది.మతపరమైన ఉద్రేకాలకు,విద్వేష పూరిత ప్రసంగాలను నమ్ముకుంటోంది.కానీ ఈ విధానం తెలంగాణలో కెసిఆర్‌పై సానుకూలతకు సాయపడుతుందన్న విశ్లేషణలున్నవి.తెలంగాణ అవతరణలో భాగస్వామి అయినప్పటికీ దాన్ని సరిగ్గా ‘క్లెయిమ్’ చేయడంలో బీజేపీ,కాంగ్రెస్ లాగానే దారుణంగా విఫలమవుతోంది.

కేవలం విధ్వంసంపైనే బీజేపీ ఆధారపడుతోందని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నవి.ఒక విధ్వంసం నుంచే నిర్మాణం వస్తుందన్న విషయం అయోధ్య విషయంలో రుజువైంది. ఆ మాటకొస్తే అసలు భారతీయ జనతా పార్టీ కూడా విధ్వంసంలో నుంచే నిర్మితమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు బీజేపీ ప్రముఖులు బాబ్రీ మసీదు శిథిలాల మధ్య నుంచే తమ భవిష్యత్తును నిర్మించుకున్నారు.అయోధ్యలోని ఒక వివాదాస్పద స్థలంలో రాముడు జన్మించిన నేలగా ప్రజలు విశ్వసించినందున దాన్ని సామాజిక, రాజకీయ ఉద్యమంగా మలిచి బీజేపీని బలోపేతం చేసిన క్రెడిట్ ముమ్మాటికి అద్వాణీకి దక్కుతుంది.

ఒక ప్రణాళికా బద్దంగా అద్వానీ రథయాత్ర జరపకపోయి ఉంటే రాజకీయపార్టీగా బీజేపీ పురోగతి సాధించేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ తప్పిదాల మూలంగానూ నరేంద్రమోదీ అత్యంత శక్తివంతంగా మారారు.పార్టీలో తనకు ఎదురు లేకుండా ఉండేందుకు వీలుగా అద్వానీ వంటి దిగ్గజాలను మోడీ తొక్కేశారు.

2014లో బిజెపి అధికారంలోకి రావడానికి రామజన్మభూమి ఉద్యమం కారణం కాదన్నా విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి.అంతకన్నా అతీతమైన రాజకీయ శక్తిని బిజెపి అదివరకే సాధించుకున్నది.ఆ ఎన్నికల్లో అయోధ్య గురించి మోడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అవినీతి,కుంభకోణాలతో కాంగ్రెస్ ప్రజల్లో అభాసుపాలు కావడం మోడీకి కలిసొచ్చింది.

బిజెపి అమ్ములపొదిలో కశ్మీర్, అయోధ్య, పౌరసత్వ చట్టం వంటివి ప్రధాన అస్త్రాలుగా ఉండేవి.వాటన్నింటినీ ఇప్పటికే ప్రయోగించారు.కనుక కొత్త ఆయుధాలు కావలసి వచ్చింది.అందుకే ‘శివలింగాల’ కథ మొదలయ్యింది.కాశీ నుంచి కరీంనగర్ దాకా ఇప్పుడదే చర్చ.అదే రచ్చ. మోడీ నుంచి బండి సంజయ్ వరకు,బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భాష ఒకే విధంగా ఉంటోంది.మార్క్సిస్టు పరిభాష వలె ఒక కొత్త పరిభాషను బీజేపీ ఎంపిక చేసుకున్నది.

ప్రజల దైనందిన సమస్యలను, నిరుద్యోగాన్నీ, ఆర్థిక సంక్షోభాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటోంది.బీజేపీ ‘విధ్వంసపు’ ఎజెండా గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన అతి కొద్దిమందిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు.

కాంగ్రెస్ పార్టీ తన భావదారిద్య్రం వల్ల ప్రజలను చైతన్యం చేయలేకపోతోంది.చేసిన తప్పిదాల గురించి ఆత్మ విమర్శ కూడా చేసుకోలేకపోతున్న అపవాదును తుడిచిపెట్టుకోవడానికి ఉదయపూర్ లో ‘చింతన్ శిబిర్’ ను నిర్వహించింది.తెలంగాణలోనూ జూన్ 1,2 తేదీల్లో ‘చింతన్ శిబిరా’న్ని నిర్వహించారు.

అటు హిందువులు, ఇటు ముస్లింల ఓట్ బ్యాంకులను పొందడానికి చేసిన ప్రయత్నాలే కాంగ్రెస్ పతనానికి కారణమయ్యాయన్న అంశాన్ని విస్మరించి మళ్ళీ అదే దారిలో ప్రయాణించేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో 1985లో 269 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సంఖ్యాబలం 1989లో 94 సీట్లకు పడిపోయింది.1991లో 46 సీట్లకు పడిపోయింది.1989 నవంబర్ లో జరిగిన 9వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది.

రాజీవ్ గాంధీ గద్దె దిగారు.బోఫోర్స్ కుంభకోణంతో పాటు అయోధ్యపై ఊగిసలాట కాంగ్రెస్ ను డిఫెన్సులో పడవేశాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ కూడా తలమునకలయ్యింది. కానీ బీజేపీ ‘ట్రాప్’ లో ఆ పార్టీ నాయకులు చిక్కుకున్నారు. లేకపోతే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం టీకాంగ్రెస్ నాయకుల బృందం ఎందుకు పూజలు నిర్వహించినట్టు ? ప్రజలకు ఏమి సందేశం ఇవ్వదలచుకున్నట్టు ? బీజేపీ బండి సంజయ్ కు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కకు తేడా ఉన్నట్టా ! లేనట్టా !

కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా మెజారిటీ హిందువులను బీజేపీ ఎట్లా అయితే వశపరచుకోగలదో అలాంటి ప్రతిభ ఆ పార్టీకి లేదు.బీజేపీ భావజాలం,దాని వ్యూహం వేరు. రాహుల్ గాంధీ ఉదయపూర్ చింతన్ శిబిర్ లో ”మనం ఒక రాజకీయ పార్టీతో పోరాడడం లేదు.ఒక భావజాలంతో పోరాడుతున్నాం. కనుక ఈ పోరాటం సులభమైనది కాదు. చాలా నేర్పుగా,సాహసోపేతంగా పోరాడవలసి ఉన్నది” అని అన్నారు.రాహుల్ గాంధీ చెప్పింది అక్షరాలా నిజం. బీజేపీ ఎజండా కు కౌంటర్ ఎజండా,బిజెపి మతోన్మాద భావజాలానికి కౌంటర్ భావజాలాన్ని రూపొందించవలసి ఉన్నది.

Tags:    
Advertisement

Similar News